ఆగస్టు 2020 రాశిఫలాలు… మీకోసం!

parrot-astrology
- Advertisement -

గమనిక:

గ్రహాల స్థితి, వాటి గతులను దృష్టిలో పెట్టుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఇస్తున్నాం.  పైగా ఈ ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి.  అయితే వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే ఆయా వ్యక్తుల పూర్తి కచ్చితత్వంతో కూడిన  ఫలితాలు  తెలుస్తాయి.  కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ పూర్తి జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

మేషం1-Mesha-Rasi

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఈ నెల నాలుగు వారాలు మీకు దిగ్విజయంగా సాగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటి నుంచి క్షేమంగా బయటపడతారు. మీ తెలివితేటలతో కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు.  చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఈ నెలలో మళ్లీ మొదలవుతాయి. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు.  అప్పు బాధలు తీరుతాయి. వ్యాపార పరంగా ముందడుగు వేస్తారు. పోటీతత్వంతో ముందుకెళ్లి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతోనూ సఖ్యత ఏర్పడుతుంది. ఆడవాళ్లు గొడవలన్నీ సద్దుమణుగుతాయి. భార్యతో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. స్థిరాస్థి వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.  అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు కొంటారు. కాకపోతే క్రయవిక్రయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ శత్రువులు కూడా శత్రుత్వం విడిచి మీకు మిత్రులుగా మారతారు. కొన్ని అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అవివాహితులకు ఈ నెలలో వివాహయోగం ఉంది. ప్రేమికుల మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది. అంతా యోగదాయకంగా ఉంది కాబట్టి మీ అంతట మీరు చొరవతీసుకొని ప్రయత్నిస్తే పనులన్నీ స్పీడుగా అవుతాయి.  విద్యార్థులు ఈ సెలవు రోజుల నుంచి మళ్లీ దారిలో పడతారు. పూర్వ స్థితిలోకి వెళతారు. ఉద్యోగులకు అంతా శుభయోగం. ప్రశాంతంగా పని చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది.

- Advertisement -

2.Vrushabha-Rasiవృషభం

కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఈ నెలంతా మీకు కాస్త ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మూడోవారంలో కొంత ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు బాగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అంటే బాగా కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని చెప్పవచ్చు. కరోనా కాలం కాబట్టి.. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. బయట దొరికేవి తిని అనారోగ్యం పాలవకండి. బయటికి వెళ్లినప్పుడు సామాజిక దూరం మీ అంతట మీరే పాటించండి. అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత చికాకుకు లోనవుతారు. విద్యార్థులు చదువులపై దృష్టి మళ్లించలేక చాలా అవస్థలు పడతారు. మహిళలు నోటిదురుసుతనం తగ్గించుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్త.. త్వరపడి డబ్బును చేయిదాటనివ్వకండి. ఈ నెలలో ఇచ్చిన అప్పులు వసూలు కావడం కూడా కష్టమే. ఉద్యోగులు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. ఈ నెల రోజులు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. క్రయవిక్రయాల జోలికి వెళ్లవద్దు. లాక్ డౌన్ కొత్తలో ఎలా ఇంట్లో ఉన్నారో.. అలాగే ఈ నెల రోజులు ప్రశాంతంగా ఇంట్లో గడపడమే క్షేమకరం. తప్పిని సరైతే తప్ప గడప దాటకండి.. దీనివల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.. అంతా శుభమే జరుగుతుంది.

3.Midhuna-Rasiమిథునం

మృగశిర,3,4 పాదాలు, పునర్వసు, ఆరుద్ర 1,2,3 పాదాలు

ఈ నెలలో తొలి వారం మీకు అనుకూలంగా ఉన్నా తర్వాత వచ్చే మూడు వారాలు మాత్రం ప్రతికూలత అధికంగా కనిపిస్తోంది. అందువల్ల గ్రహ స్థితిని బట్టి మీరే ఒక అడుగు వెనక్కి తగ్గాలి. చేపట్టిన పనులు పూర్తికావు. రావల్సిన డబ్బులు చేతికి అందవు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎక్కువగా ఇతరులపై ఆధారపడి ఆశలు పెట్టుకోవద్దు. ఈ నెలలో అనుకున్న పనుల్లో చాలా వరకు పూర్తికావు, నిరాశ ఎదురుకావచ్చు. అలా అని డిప్రెషన్‌‌కు లోనై చెడు వ్యసనాల బారిన పడకండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. కొన్ని పాటించండి. డబ్బుల విషయంలో మీ మాట నిలబడకపోవచ్చు. అప్పుల బాధ ఎదురుకావచ్చు. స్నేహితుల నుంచే మాట పడతారు.. మనోవేదనకు గురి అవుతారు. అందుకే ఈ నెల ఎవరి నుంచి సహాయం, మాట సాయం, డబ్బు.. ఏదీ ఆశించకండి. అప్పుడు మీకెటువంటి సమస్యా ఉండదు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు అందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి. కాబట్టి జాగ్రత్త.

4-Karkataka-Rasiకర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష

ఈ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి మూడు వారాలు అనుకూలంగా, ఒక వారం ప్రతికూలంగా కనిపిస్తోంది. చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు.. కానీ అవన్నీ సర్దుకుని అంతా సవ్యంగా జరుగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. ఒకేసారి అన్ని ఖర్చులు మీదపడటంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అయితే ఇదంతా మొదటివారం మాత్రమే. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మనోధైర్యం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచైనా సులువుగా బయటపడతారు. ఒకేసారి అనుకూలత రావడం వల్ల.. మీరు పనులు వేగంగా చేయడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా కాస్త సంయమనం పాటిస్తూ నెమ్మదిగా ముందుకు సాగండి.. విజయం సిద్ధిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. స్థిరాస్థికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం అంత తేలిగ్గా కొలిక్కి రావు. మీ శత్రువులు మారినట్టు పైకి మంచిగా కనిపించి.. మళ్లీ మీతో స్నేహం చేయాలని చూస్తారు. అయినా వారిని పూర్తిగా నమ్మకండి. వ్యాపారులు మొదటి వారం కాకుండా రెండోవారం నుంచి ఆగిపోయిన పనులు ప్రారంభించండి. కొత్తగా వ్యాపార విస్తారణ చేయాలనుకున్నా చేయండి. ఉద్యోగులకు శుభప్రదం. ఉన్నత స్థితికి వెళతారు. మహిళలు ప్రశాంతంగా ఉంటారు. సమస్యలన్నీ సర్దుకుంటాయి. వినాయకుని అష్టోత్తరం చదవండి. శివ దర్శనం చేసుకోండి.. అంతా సవ్యంగా జరుగుతుంది.

5-Simha-Rasiసింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఈ రాశి వారికి ఈ నెల కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటే మంచిది. నెలలో మొదటి వారం ఆశాజనకంగా మొదలై.. మిగిలిన మూడు వారాలు నిరాశాజనకంగా ముగుస్తాయి. గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల కొత్త పనులు వాయిదా వేయడమే మంచిది. క్రయవిక్రయాల జోలికి వెళ్లవద్దు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా మంచిది కాదు. ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి. అసలే కరోనా కాలం.. కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఇది మీకు గడ్డుకాలమే. చేతికి అందాల్సిన డబ్బులు అందవు.. దాంతో ఆర్థికంగా కష్టాలు పడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అవకాశాలు వచ్చినా ఆ బాధ్యతలు నిర్వహించలేక అవస్థలు పడతారు. ప్రమోషన్ వద్దనలేరు. పని చేయలేరు అన్నట్టు ఉంటుంది. గృహిణులకు యోగదాయకం. నెలలో మొదటి వారం కాస్త అణకువగా ఉంటే.. ఆ తర్వాత మూడు వారాలు మీమాటే చెల్లుబాటవుతుంది. విద్యార్థులు త్వరగానే గాడిలో పడతారు. ఎప్పటిలాగే వాళ్ల చదువుల బాటలో వాళ్లు వెళ్లిపోతారు. కనకధార స్తోత్రం చదువుకుంటే అంతా మంచే జరుగుతుంది.

6.Kanya-Rasiకన్య

ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు

ఈ నెలంతా మీకు యోగదాయకంగా ఉంది. మూడో వారంలో కొంత ప్రతికూలతలున్నా.. మిగిలిన మూడు వారాలు అనుకూలంగా ఉండటంతో ఆ ఒక్కవారం పెద్దగా ప్రభావం చూపించదు. ముఖ్యంగా ఈ నెలలో మీ అప్పులు తీర్చే అవకాశాలున్నాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెడతారు. ఇప్పటికే వ్యాపారం ఉన్న వారు దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళదామా అని ఆలోచనలు చేస్తారు, అవి కూడా కలిసి వస్తాయి. అన్నీ మీరనుకున్నట్టే జరుగుతుంటాయి. బ్యాంకు రుణాలు, క్రయవిక్రయాలు అన్నీ అనుకూలిస్తాయి. ఆగిపోయిన పనులన్నింటిని నెమ్మదిగా పట్టాలెక్కిస్తారు. వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబపరంగా విభేదాలు తొలగుతాయి. భార్యతో సఖ్యత కుదురుతుంది. ఎలాంటి గొడవలున్నా అన్నీ సమసిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు మంచి శుభకాలం నడుస్తుంది. అయితే ఒకవారం ప్రతికూలంగా ఉందని చెప్పుకున్నాం కదా.. అది జూన్ నెలలో మూడోవారం అన్నమాట. ఆ వారంలో చేయని తప్పులకు నిందలు పడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనువుగాని వేళ అధికులమని అనవద్దు. అంటే మన దగ్గర నుంచి మాట జారనివ్వద్దు. అవతలివాళ్లు అదే పట్టుకుని మిమ్మల్ని కార్నర్ చేస్తారు. మీరు సతమతమవుతారు. ఈ ఒక్కవారం తప్ప అంతా బాగానే ఉంది. ఒక మార్పునకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య హృదయం చదవండి.. అన్నివిధాల మంచిది.

7-Tula-Rasiతుల

చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ఈ మాసంలో తులారాశి వాళ్లకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి పదిహేను రోజులు పనులు ముందుకు సాగవు..తర్వాత పదిహేను రోజులు అనుకూలంగా గోచరిస్తున్నాయి. అందువల్ల మొదటి పక్షం రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాల్లో కొంచెం నిదానంగా వెళ్లడమే మంచిది..దూకుడు తత్వం పనికిరాదు..ఎలాగూ కరోనా కాలమే కాబట్టి.. ఇంటిపట్టునే ఉండి ప్రశాంతంగా కాలక్షేపం చేస్తే బాగుంటుంది. తర్వాత పక్షం రోజుల్లో మీరేం అనుకున్నారో అవి మొదలుపెడితే శ్రమ లేకుండా బయటపడతారు. కుటుంబవ్యవహారాల్లో చికాకులు తప్పవు. స్థిరాస్థి వ్యవహారాల్లో పక్షం రోజులు తలదూర్చవద్దు..శత్రువులు పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగుల పరంగా కూడా ఈ తలనొప్పులు తప్పేలా లేవు. క్రయ విక్రయాలు చేయవద్దు. విద్యార్థులు కూడా మళ్లీ గాడిలో పడటానికి సమయం పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 15రోజులు ఇంట్లో ఉండండి..హాయిగా టీవీ చూడండి..జంధ్యాల సినిమాలు, కామెడి సినిమాలు మాత్రమే చూడండి..ఇంట్లో వాళ్లు ఏ కామెంట్లు చేసినా..ఈచెవితో విని ఆ చెవి నుంచి వదిలేయండి. తర్వాత 15రోజులు మళ్లీ నడుం బిగింది..ఈ 15రోజుల సమయాన్ని కవర్ చేయండి.. అంతా శుభం జరుగుతుంది.

8-Vruschika-Rasiవృశ్చికం

విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ్య

ఈ మాసం ఈ రాశివాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపించడం వల్ల..అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోవడంతో చిరాకులెక్కువ అవుతుంటాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తలనొప్పులుంటాయి. ఇవ్వాల్సిన వాడు ఇవ్వడు..తీసుకున్నవాడు ఊరుకోడు..అన్నచందంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి. మొదలు పెట్టిన పనులు అంత తేలిగ్గా పూర్తికావు. ఎందుకంటే ఈ మాసం మొదటి మూడు నెలలు ప్రతికూలంగానూ ఆఖరి వారం అనుకూలంగాను ఉంటుంది.అందువల్ల నెలాఖరురోజుల్లో మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే సూచనలున్నాయి. క్రయవిక్రయాల జోలికి వెళ్లవద్దు. కొన్ని రావల్సిన సొమ్ములు చేతికందక ఇబ్బందులు పడతారు. ఇదే తరహా అన్ని వర్గాలవారికి అంటే వ్యాపార, ఉద్యోగ, విద్యార్థి అందరికీ వర్తిస్తుందని చెప్పాలి. మహిళలు కూడా కొంచెం సంయమనం పాటించాలి. ప్రణాళికలు బాగా వేయడం వల్ల అందరిలో మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా ఈ కరోనా రోజుల్లో సమస్యల నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి వ్యాపారాలు చేయాలి? వీటిపై దృష్టి పెడతారు.విజయం వైపు అడుగులు వేస్తారు. మొత్తానికి ఈ మాసం రోజులు కొంచెం జాగరూకతతో ఉండి..గట్టెక్కాల్సి ఉంది. అందువల్ల విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే మంచి జరుగుతుంది.

9-Dhanoo-Rasiధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం

ఈ మాసం చిన్నచిన్న ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రతి పని శ్రమాధిక్యత తోనే పూర్తవుతుంది. కీర్తి కాంక్ష ఎక్కువవుతుంటుంది. గతంలో జరిగిన నష్టాల నుంచి బయటపడేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ఆ ప్రకారం ముందుకెళ్లి విజయం సాధిస్తారు. అయితే కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఓర్పుతో ముందుకు నడవాలి. కుటుంబపరంగా కూడా కలిసి వస్తుంది. ఈ కష్టకాలంలో వాళ్లు మీకు తోడుగా ఉంటారు. వ్యాపారంలో ఎలాగోలా ఒడ్డున పడతారు..అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల పరంగా మీ తోటి ఉద్యోగులు చేసిన తప్పులు మీరే భరించాల్సి ఉంటుంది. మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల మీ పనులే కాదు.. మీ కింద పని చేస్తున్నవారి పనులు సక్రమంగా గమనించి చూసుకోండి. మహిళలకు ఆర్థిక యోగం ఉంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. క్రయవిక్రయాల జోలికి వెళ్లవద్దు. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగానే మీ జీవితంలో మార్పు సంభవిస్తుందని గుర్తుంచుకోండి. వాహన ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా కొన్ని ప్రతికూలతల కారణంగా మీరే సంయమనం పాటించండి. విద్యార్థులపై కూడా ఇవే ప్రభావాలు ఉండటం వల్ల చదువు అంతంతమాత్రంగా సాగుతుంది. అయితే పట్టుపట్టి బట్టీపట్టి చదవాల్సి ఉంటుంది. ఈమాసంలో ఈ ఇక్కట్ల నుంచి బయటపడేందుకు లలితా సహస్రార్చన చేసుకోండి. శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకొని రండి. అంతా మేలు జరుగుతుంది.

10-Makara-Rasiమకరం

ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

ఈ రాశి వారికి ఈ నెలలో ముప్పావు భాగం యోగదాయకంగా ఉంటుంది. ఒక పావు భాగం మాత్రం ప్రతికూలమనే చెప్పాలి. అయినా సరే మూడొంతులు ప్లస్ లోనే ఉన్నారు కాబట్టి ఈ నెల మీకు కలిసివచ్చే కాలమే. ముఖ్యంగా మీ జీవితంలో మార్పు తెచ్చే నెలగా చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాలం అనుకూలించడం వల్ల మీ వ్యవహార తీరు ఎలా ఉన్నా.. పనిలో మాత్రం ఆటంకాలు ఎదురుకావు.. అన్నీ చకచకా జరిగిపోతుంటాయి. అంటే కార్యసాధన ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో కూడా ఇబ్బందులు, చికాకుల నుంచి బయటపడతారు. ఒక పద్ధతి ప్రకారం నడుస్తారని చెప్పాలి. వ్యాపారంలో, ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకుంటారు. పరిశ్రమలు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రణాళికలు వేస్తారు. ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అయితే మొదటి వారం కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. తర్వాత మూడు వారాలు సక్సెస్ ఫుల్‌గా మీ ప్రయాణం సాగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలన్నీ చాలా బాగుంటాయి. దాంతో మరింత కష్టపడి వ్యాపారాలని లాభాల బాటలో నడిపిస్తారు. ముఖ్యంగా మానసికంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకి శ్రమాధిక్యతతో కూడిన ఫలితాలుంటాయి. ఎందుకంటే సెలవు రోజులు బాగా ఎంజాయ్ చేయడం వల్ల మళ్లీ చదువుల్లో పడేందుకు కొంత సమయం పడుతుంది. మహిళలకు సమస్యలు తగ్గుతాయి. అన్ని వర్గాల వారికీ అనుకూల ప్రభావాలున్నాయి.

11.Kumbha-Rasiకుంభం

ధనిష్ట 3,4, పాదాలు శతబిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఈ నెల రోజులు మీకు కలిసి వచ్చే కాలమనే చెప్పాలి. ఆగిపోయిన పనులన్నీ చాలా వేగంగా కదిలే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏమీ కంగారుపడకండి. ధైర్యంగా ఉండండి. దైవ సంకల్పం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మొండిబకాయిలు కూడా వసూలవుతాయి. మొత్తానికి చేతిలో కొంత డబ్బు ఉంటుంది. గతంలో తగిలిన దెబ్బల ఫలితంగా ఇక్కడ నుంచి ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఎలా చూసినా ఈ నెలంతా మీకు యోగదాయకంగానే కనిపిస్తోంది. ఏవైనా కొత్త పనులు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ నెలలోనే మొదలుపెట్టండి. దిగ్విజయంగా ముందుకెళతారు. కళత్రయోగం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులకు యోగకాలం. సెల్ ఫోన్ జాడ్యం నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలున్నాయి. అయితే వ్యాపారాలు చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాల్లేకుండా ఖాళీగా ఉన్న వారికి చిన్నచిన్న ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసే వాళ్లకి ప్రశంసలు లభిస్తాయి. మహిళలకు కోరుకున్నవన్నీ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12-Meena-Rasiమీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఈ నెలలో మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు వల్ల మీ జీవిత గమనమే మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పుతాయి. వేధింపులు తగ్గుతాయి. ప్రమోషన్లు పొందుతారని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అని మీరు గుర్తించాలి. మీ ఆలోచనలతో చాలామంది ముందడుగు వేస్తుంటారు. అవన్నీ మీరు గుర్తుచేసుకొని వాటిని మీకు అన్వయించుకోండి. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ముఖ్యంగా ఆగిపోయిన అన్ని పనులు పూర్తవుతాయి. బ్యాంకు లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణ బాధల నుంచి విముక్తులవుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తిపాస్తులు సంక్రమించే కాలం.. మీ జీవిత గమనాన్నే మార్చేసే స్నేహితులు మీకు తారసపడతారు.. మీ ఉన్నతికి సాయపడతారు. కుటుంబంతో కలిసి మీరు హాయిగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అయితే జాగ్రత్త.. మీ ఉన్నతిని చూసి ఈర్ష్య పడేవాళ్లు ఎక్కువవుతుంటారు. మహిళలు గృహ సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. మొత్తమ్మీద అన్నివర్గాల వారికి ఈ నెల అనుకూలిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మంచి యోగకాలం నడుస్తోంది. మీ ఇష్టదైవాన్ని రోజూ ప్రార్థించండి. 

- Advertisement -