ఈ ఏడాదిలోనే.. జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు!

- Advertisement -
ముంబై: 4జీ సర్వీసులతో దేశంలో మొబైల్‌ విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో అదేస్థాయిలో మరో విప్లవం సృష్టించబోతోంది. ఉచిత వాయిస్‌ కాల్స్‌, తక్కువ ధరలకే మొబైల్‌ ఫోన్‌లు, అతి తక్కువ ధరలకే మొబైల్‌ డేటా అందించి టెలికం రంగంలో అగ్రభాగాన నిలిచిన జియో ఇప్పుడు  గుట్టుచప్పుడు కాకుండా ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఏడాది జూలై, డిసెంబర్‌ మధ్య దేశవ్యాప్తంగా ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రారంభించడానికి జియో సన్నాహాలు చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా నెలకు 1100 జీబీ ఉచిత డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు రూ.4,500 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేయనున్నట్లు సమాచారం.
జియో దేశంలోని 99 శాతం ప్రాంతాలకు త్వరలోనే ఈ సేవలను అందించనుంది. ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను పొందే వినియోగదారులకు జియో ఒక రౌటర్‌ను కూడా అందజేయనుంది.  ఇది సెట్‌టాప్ బాక్స్‌ మాదిరిగా కూడా పనిచేస్తుంది. దీని ద్వారా అనేక సేవలు పొందేందుకు వీలవుతుంది. సుమారు 360 టీవీ చానల్స్‌ ఈ బాక్సు ద్వారా పొందవచ్చంటున్నారు. ఇందులో 50 హెచ్‌డీ చానల్స్‌ ఉంటాయి.
ఈ బాక్సుకు అనుబంధంగా ఉండే రౌటర్‌ ద్వారా వైఫై సిగ్నల్స్‌ వస్తాయి. దీంతో ఇంటిలోని వారందరూ ఒకేసారి మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల ద్వారా హైస్పీడ్‌ డేటా సేవలను పొందేందుకు వీలవుతుంది. అంతేకాదు, ఈ ఫైబర్‌ టు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌  సేవలు పొందే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ లేదా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను కూడా చూడగలిగే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. పైగా ప్రారంభంలో కొంతకాలంపాటు ఈ సేవలు ఉచితంగానే లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -