ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ కోసం 10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు

5:24 pm, Fri, 10 January 20

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రారంభించిన వైఫీ కాలింగ్ సేవలకు ఖాతాదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా ఈ సేవల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు ఎయిర్‌టెల్ శుక్రవారం ప్రకటించింది.

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవలను వినియోగించుకునేందుకు అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాదు, యాప్ కానీ, సిమ్ కార్డు కానీ అవసరం లేకుండానే ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఈ సేవలను తీసుకొచ్చిన తొలి సంస్థ తమదేనని, ఎయిర్‌టెల్ ఖాతాదారులు ఏ వైఫైని అయినా ఉపయోగించుకుని ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ శేఖన్ తెలిపారు. ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవలను శుక్రవారం ఎయిర్‌టెల్ ప్రారంభించగా ఆ తర్వాత రెండు రోజుల్లోనే ప్రత్యర్థి రిలయన్స్ జియో కూడా తమ మొబైల్ యూజర్ల కోసం ఈ సేవలను ప్రారంభించింది.

ఈ నెల 16లోపు దేశం మొత్తం జియో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌టెల్ వైఫై సేవలు కేవలం 16 బ్రాండ్ల మొబైల్ హ్యాండ్స్‌సెట్స్‌కు మాత్రమే పరిమితం కాగా, జియో సేవలు 150 మొబైల్ హ్యాండ్స్‌సెట్స్‌లో వినియోగించుకోవచ్చు.