‘జూమ్’కి గట్టి పోటీ ఇస్తోన్న ‘గూగుల్ ‘.. కొత్త యాప్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాన్ఫరెన్స్!

Google-Meet-now-has-Zoom-like-Features
- Advertisement -

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వేళ వర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఆదరణ పెరిగింది. మరోవైపు వీడియో కాలింగ్ యాప్ ‘జూమ్’ వినియోగం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: ‘జూమ్’‌కు పోటీ యాప్.. తయారు చేస్తే రూ.కోటి నజరానా: ప్రకటించిన కేంద్రం

అంతేకాదు, ‘జూమ్’ వంటి యాప్ తయారు చేసిన వారికి రూ.కోటి రూపాయల నజరానా ఇస్తామంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) కూడా ఆవిష్కరణ కర్తలకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో డెవలపర్లు.. ‘జూమ్’కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ కూడా ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ‘గూగుల్’ తన వీడియో కాలింగ్ యాప్ ‘హ్యాంగవుట్’ను మరింత ఆధునీకరించి, కొత్త ఫీచర్లు జోడించి ‘గూగుల్ మీట్’గా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

ఒకేసారి 16 మంది యూజర్లు…

గూగుల్ మీట్ వీడియో కాలింగ్ యాప్‌లో ఇప్పటి వరకు ఒక స్క్రీన్‌పై కేవలం నలుగురు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించేవారు. ఇప్పుడు గూగుల్ ఈ సంఖ్యను 16కు పెంచింది. 

చదవండి: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్! ఒకేసారి 8 మంది…

అంతేకాదు, యూజర్లు ఉన్న ప్రదేశంలో లైటింగ్ కండీషన్ సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాంకేతికత ద్వారా యూజర్లు పరస్పరం స్పష్టంగా కనిపించేలా కొత్త ఫీచర్ జోడించారు. 

మొబైల్ యూజర్లకు కూడా…

ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. అలాగే కాన్ఫరెన్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను ఇతరులకు షేర్ చేయడానికి వీలుగా ‘ప్రెజెంట్ ఎ క్రోమ్ ట్యాబ్’ సౌకర్యాన్ని కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

‘జీ సూట్’ వినియోగదారులందరికీ ‘గూగుల్ మీట్’ యాప్‌కు సంబంధించిన అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపిన గూగుల్.. వినియోగదారుల డేటా భద్రతకు కూడా కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 

చదవండి: రిలయన్స్ జియో వినియోగదారులందరికీ గుడ్ న్యూస్!

‘గూగుల్ మీట్‌’లో త్వరలోనే ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ఫీచర్‌ను కూడా జోడించనున్నామని, వీడియో కాన్ఫరెన్స్‌ మధ్యలో యూజర్ల వెనుక వ్యక్తులు తిరిగినప్పుడు కలిగే ఇబ్బందిని కూడా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.  

- Advertisement -