ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

5:06 pm, Fri, 27 December 19

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించి కాలపరిమితిని గణనీయంగా తగ్గించింది. అయితే, మిగతా ప్రయోజనాలను మాత్రం యథాతథంగా ఉంచింది.

ఈ ప్లాన్‌ కాలపరిమితి ఇప్పటి వరకు 82 రోజులు కాగా, దానిని 26 రోజులు తగ్గించి 56 రోజులకు పరిమితం చేసింది. ఇక మిగతా ప్రయోజనాలైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లను అలాగే ఉంచింది.

ఈ ప్లాన్‌లో భాగంగా షా అకాడమీ నుంచి ఫొటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి వాటిని నాలుగు వారాల పాటు ఉచితంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి.

జీ5, హూక్, 370కిపైగా లైవ్ టీవీ చానళ్లు, 10 వేలకు పైగా సినిమాలు వీక్షించవచ్చు. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ప్యాక్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.