బంగారాన్ని మధ్య తరగతి ఇక మర్చిపోవలసిందే! రూ.50 వేల దిశగా పసిడి పరుగులు…

gold price is far away from middle class running towards 50k

ముంబై: మధ్యతరగతి ప్రజలు బంగారం అనే మాటను ఇక మర్చిపోవాలసిందేమో. గత కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పసిడి ధర మధ్యతరగతి స్థాయిని దాటేస్తోంది.

రూ. 50 వేల దిశగా పరుగులు తీస్తున్న బంగారం ధర, సమీప భవిష్యత్తులో రూ. 60 వేలను తాకవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్ దేశీయ నగల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు రెండు నెలలుగా నగల దుకాణాలు మూతపడ్డాయి.

పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అవి కూడా వాయిదా పడడమో, లేదంటే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పని కానిచ్చేయడంతో బంగారం ఊసే లేకుండా పోయింది.

దీనికి తోడు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్‌ దేశాల బలహీన ఎకనమిక్‌ డేటా ఇవన్నీ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పసిడినే నమ్ముకోవడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్లు తాకినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.