ఆధార్ ఉంటే పది నిమిషాల్లో ‘ఈ-పాన్’! పొందాలంటే ఇలా చేయండి…

5:38 pm, Sat, 22 February 20
e-PAN-just-in-ten-minutes

హైదరాబాద్: ప్రభుత్వం నుంచిగాని, ప్రభుత్వ కార్యాలయాల నుంచిగాని ఏదైనా గుర్తింపు కార్డు తీసుకోవాలంటే ఎవరైనా సరే ఇతర అన్ని పనులు వదిలేసుకుని ఆయా కార్యాలయాల చుట్టు తిరగాల్సిందే.

మొదట దరఖాస్తు సమర్పించి, ఆపైన దానికోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిందే. ఈ విపరీత జాప్యం, అందులోనూ మళ్లీ ‘అమ్యామ్యా’ వ్యవహారం.. వీటికి భయపడే చాలామంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతుంటారు.

అయితే పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) విషయంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఆదాయపన్ను శాఖ పలు చర్యలు తీసుకుంది.

ఇప్పుడు పాన్ కార్డు పొందడం ఎంతో సులభం. అది కూడా ఆన్‌లైన్‌లో.. మీ ఆధార్ వివరాలను పొందుపరిస్తే జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీకు పాన్ నంబర్ జారీ అవుతుంది. ఇది పీడీఎఫ్ ఫార్మేట్‌లో మీకు లభిస్తుంది.

సాధారణ పాన్ కార్డుకు ఎంత విలువ ఉంటుందో ఈ పీడీఎఫ్ రూపంలో ఉన్న పాన్‌కు అంతే విలువ లభిస్తుంది.

పాన్ కోసం దరఖాస్తు ఇలా…

* మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌‌ను https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/ అనే లింక్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన పేజీలో కనిపించే Get New PAN పైన క్లిక్ చేయండి.

* కొత్త పాన్ నంబర్ కోసం మీ ఆధార్ సంఖ్యను అందులో నమోదు చేయండి. అక్కడ చూపించిన క్యాప్చాకోడ్‌ను కింద ఇచ్చిన బాక్స్‌లో నమోదు చేయండి.

* ఆ వెంటనే మీ ఆధార్‌కు అనుసంధానమై ఉన్న మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి, ఆ తరువాత వెబ్‌సైట్‌లో అడిగిన ఇతర వివరాలను నమోదు చేయండి.

* మీ ఈ-మెయిల్ ఐడీని పాన్ కార్డుకు అనుసంధానం చేసి వ్యాలిడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Check Status / Download PAN అనే అప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా.. మీ పాన్ మీరు పొందుపరిచిన మీ ఈ-మెయిల్ ఐడీకి పీడీఎఫ్ ఫార్మేట్‌లో వస్తుంది.

* మీరు సమర్పించిన ఆధార్ వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) తన వద్ద ఉండే మీ ఆధార్ సమాచారంతో సరి చూసుకుంటుంది.

* ఆ వెంటనే మీకు ఈ-పాన్ కేటాయింపబడుతుంది. ఆన్‌లైన్‌లో ఇదంతా జరిగేందుకు మీకు పది నిమిషాల సమయం కూడా పట్టదు. ఇలా మీరు జనరేట్ చేసుకున్న మీ పాన్‌ను పీడీఎఫ్ ఫార్మేట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ వెబ్‌సైట్ మీకు కల్పిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు…

* మైనర్లకు ఈ-పాన్ జారీ చేయరు.
* గతంలో పాన్ కార్డు పొంది ఉండని వారికి మాత్రమే ఈ ఈ-పాన్ పొందే అవకాశం.
* మీ మొబైల్ నంబర్ ముందుగానే మీ ఆధార్ వివరాలకు జత చేయబడి ఉండాలి.
* మీ పుట్టిన తేదీ వివరాలను మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగానే DD-MM-YYYY ఫార్మేట్‌లోనే ఇవ్వాలి.

e-PAN-just-in-ten-minutes