జియో బంపరాఫర్: నెలకు రూ.600కే హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, కేబుల్ టీవీ!

jio-giga-fiber-services-1
- Advertisement -

ముంబై: రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సేవలను దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో జియో 100 ఎంబీపీఎస్ స్పీడుతో నెలకు 100 జీబీ డేటాతో తన గిగాఫైబర్ సేవలను అందిస్తోంది.

జియో తన గిగాఫైబర్ సేవలకు సంబంధించి అవసరమైన రూటర్, ఇన్‌స్టలేషన్ సేవల కోసం వినియోగదారుల నుంచి ఒన్ టైం డిపాజిట్ కింద రూ.4,500 తీసుకుంటోంది. ఇప్పటివరకూ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ మాత్రమే అందిస్తోన్న జియో మరో మూడు నెలల్లో ఇదే రూటర్ నుంచి వినియోగదారులకు ల్యాండ్ లైన్ టెలిఫోన్‌తోపాటు డీటీహెచ్ సేవలను కూడా అందించనుంది.

ఉచిత సేవలు మరో ఏడాదిపాటు!?

ఎగ్జైటింగ్ విషయం ఏమిటంటే.. ఇప్పటికే దాదాపు 6 నెలలుగా ఉచితంగా గిగాఫైబర్ ద్వారా జియో అందిస్తోన్న ఈ సేవలు మరో ఏడాదిపాటు పొడిగించాలని భావించడం. జియో గిగాఫైబర్ సేవలు దేశ వ్యాప్తంగా అధికారికంగా లాంచ్ చేసేంత వరకు.. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అందిస్తోన్న ఈ సేవలు మరో ఏడాదిపాటు ఉచితంగానే అందుతాయి.

jio-giga-fiber-servicesఆల్-ఇన్-వన్ సేవలు…

ఇప్పటి వరకు వినియోగదారులు ఫోన్ కనెక్షన్ విడిగా, టీవీ కోసం డీటీహెచ్ కనెక్షన్ విడిగా, ఇంటర్నెట్ కనెక్షన్ విడిగా తీసుకోవలసి వస్తోంది. ఈ మూడు రకాల బిల్లలు కలిపి నెలకు తడిసి మోపెడవుతున్నాయి. అయితే త్వరలో జియో తన గిగాఫైబర్‌ సేవలను అప్‌గ్రేడ్ చేస్తోంది.

ఫలితంగా హైస్పీడ్ ఇంటర్నెట్‌తోపాటు ల్యాండ్‌లైన్, కేబుల్ టీవీ సేవలు కూడా ఒకే కనెక్షన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.. అదీ నెలకు అత్యంత తక్కువ ధరలో.

ఆప్టికల్ నెట్‌వర్క్ టర్మినల్ ద్వారా ఐపీ నెట్ ద్వారా టీవీ చానళ్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే అన్ని చానళ్లు ఉచితంగా ఇస్తారా? లేదంటే ప్రస్తుతం ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకోవలసి ఉంటుందా? అనే విషయంలో మరింత క్లారిటీ రావాలసి ఉంది.

అలాగే ల్యాండ్ లైన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కూడా జియో కల్పించనుంది.

స్మార్ట్ హోమ్ నెట్‌వర్క్…

ఇంటర్నెట్, ఫోన్, టీవీ సదుపాయాలు మాత్రమేకాకుండా మొత్తం ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చుకునేలా రిలయన్స్ జియో భారీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పుడున్న ఆప్టికల్ నెట్‌వర్క్ టెర్మినల్‌కే ఇంట్లోని వివిధ స్మార్ట్ గృహోపకరణాలను అనుసంధానించుకోవచ్చు.

అలాగే సీసీటీవీ కెమెరాలను కూడా ఈ టెర్నినల్‌కు అనుసంధానించి, బయట ఎక్కడున్నా క్లౌడ్ ద్వారా మన ఇంట్లో లేదా ఆఫీసులో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూడొచ్చు.

ఈ సౌకర్యాలన్నీ నెలకు రూ.600కేనా!?

అధికారికంగా ధరలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ.. ఈ సౌకర్యాలన్నీ కూడా నెలకు రూ.600కే ఇవ్వాలని జియో భావిస్తోందని, అలాగే ఇతరత్రా ప్లాన్లు కూడా నెలకు రూ.1000కి మించవని ఆన్ గ్రౌండ్ టీం సహా టాప్ మేనేజ్‌మెంట్‌లోని పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తులు చెబ్తున్నారు.

ప్రస్తుతం దశలవారీగా ఆయా ప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తోన్న రిలయన్స్ జియో త్వరలో వీటిని 1600 నగరాలకు విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఈ దిశగా నాలుగైదేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన జియో ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్నిరకాల సేవలనూ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -