మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా మన తెలుగు తేజం! పట్టుదల, కృషి, అదృష్టం అన్నీ కలిస్తే ‘సత్య నాదెళ్ల’…

- Advertisement -

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవోగా కొనసాగుతున్న మన తెలుగుతేజం సత్య నాదెళ్ల మరో శిఖరాన్ని అధిరోహించారు. ఆయన్ని కంపెనీ ఛైర్మన్‌గా నియమిస్తూ గత బుధవారం మైక్రోసాఫ్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా జాన్ థాంప్సన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో సత్య నాదెళ్లను నియమించినట్లుగా కంపెనీ ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. చైర్మన్‌గా నియమితులైనప్పటికీ సత్య నాదెళ్ల.. కంపెనీ సీఈఓగా కూడా కొనసాగనున్నారు. 

- Advertisement -

2014లో స్టీవ్ బామర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితుడైన సత్య నాదెళ్ల కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. లింక్డిన్, నాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతోపాటు వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి 2014లో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన జాన్ థాంప్సన్.. ఇప్పుడిక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సంస్థకు సేవలు అందించనున్నారు.

ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్. అయితే ఏడాది క్రితం బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన ‘బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్’ పనులపై దృష్టి సారించడం కోసమే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. 

మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు నుంచి బిల్ గేట్స్ తప్పుకున్న ఏడాది తర్వాత మళ్లీ సంస్థలో ఉన్నతస్థాయి కార్యనిర్వాహక వర్గంలో తాజా మార్పు చోటుచేసుకోవడం గమనించదగ్గ పరిణామం. ఇక సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన తరువాత ఆ కంపెనీ కొత్త కొత్త మార్గాల్లోకి విస్తరించింది.

ముఖ్యంగా.. కోవిడ్ మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, విద్యార్థులకు బోధన కూడా ఆన్‌లైన్లో కొనసాగాల్సి రావడం వంటి పరిణామాల కారణంగా మైక్రోసాఫ్ఠ్‌కు చెందిన అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ 50 శాతం అభివృద్ధి సాధించినట్లు 2021 జనవరిలో ఆ కంపెనీ పేర్కొంది.

2020లో మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్ ధర కూడా 41 శాతం పెరిగింది. అంతేకాదు, ఈ ఏడాది ప్రారంభంలోనూ కంపెనీ షేర్ విలువ మరో 5 శాతం పెరిగింది.

మొత్తంగా, 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ 3,690 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జిస్తే, 2020 డిసెంబర్‌లో ఆదాయం 4308 కోట్ల డాలర్లకు పెరిగింది. 

ప్రపంచంలో యాపిల్ తరువాత రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుత మార్కెట్ విలువ 1,90,000 కోట్ల డాలర్లు.

సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌ను అమెరికాలోని రెండవ అతిపెద్ద విలువైన సంస్థగా తీర్చిదిద్దారంటూ అమెరికాకు చెందిన ‘ది వాల్ స్ట్రీట్ జనరల్’ పత్రిక తన కథనంలో పేర్కొందంటే మన ‘తెలుగుతేజం’ ఘనత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

1967లో హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. ఆయన తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తల్లి సంస్కృతం లెక్చరర్. 

సత్య నాదెళ్ల 1988లో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. 1996లో చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎం‌బి‌ఏ పూర్తి చేశాడు. 

- Advertisement -