ఓలా, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుల గురించి విన్నారా…??

2:38 pm, Sat, 4 May 19
Ola and Flipkart gear up to launch credit cards soon

 

ఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ, దేశ వ్యాప్తంగా తమ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు క్రెడిట్ కార్డ్ లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

వీరికి సహకరించేందుకు కొన్ని పెద్ద బ్యాంకులు ముందుకు రావడంతో ఈ రెండు సంస్థలు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో అమెజాన్‌ పే, ఐసీఐసీఐ బ్యాంక్‌ సౌజన్యంతో   జత కట్టి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అదే త్రోవలోకి ఓలా, ఫ్లిప్ కార్ట్ సంస్థలు రావడం విశేషం.

క్రెడిట్ కార్డులు జారీ చెయ్యడం ద్వారా కార్డు హోల్డర్ల ఖర్చులపై ఒక అవగాహన రావడమే కాకుండా.., క్రెడిట్ కార్డ్ రంగంలోకి కూడా కాలు మోపినట్టు అవుతుందనే అభిప్రాయంతో ఓలా, ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డులను ప్రవేశ పెడుతున్నట్టు ఆయా సంస్థలకు సంబంధించిన వారు చెబుతున్నారు.

ఇప్పటికే కస్టమర్ల సౌలభ్యం కోసం ‘బై నవ్ పే లేటర్’ విధానాన్ని అమలు చేసిన ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులతో మరో అడుగు ముందుకు వేస్తుంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో గానీ  యాక్సిస్ బ్యాంకుతో గానీ జత కట్టి క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇక ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా విషయానికి వస్తే.. ఓలా తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తో చేతులు కలిపింది. ఓలా ప్రతినిధి చెప్పిన సమాచారం ప్రకారం వచ్చే వారంలోనే దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో 10లక్షల క్రెడిట్ కార్డులను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

చదవండి:భారీగా తగ్గిన బంగారం ధర! అక్షయ తృతీయ నేపథ్యంలో కిక్కిరిసిన దుకాణాలు…