సంచలనం: పెద్ద నోట్లు బంద్!? ఇక ఆ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు రావు…

1:22 pm, Mon, 7 October 19
SBI starts not to filling 2000 rupee notes in atms

న్యూఢిల్లీ: పెద్దనోట్ల చలామణీని క్రమంగా తగ్గించాలని కేంద్రం భావిస్తోందా? పరిస్థితులు చూస్తుంటే దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. రూ.2 వేల నోటును మోడీ సర్కారు బంద్ చేయబోతోందని ఆ మధ్య వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే అది అప్పట్లో జరగలేదు.

కానీ తాజాగా తమ ఏటీఎంలలో రూ.2 వేల నోటు అందుబాటులో లేకుండా చూడాలని దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించింది. దీనికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి ఈ మేరకు తమకు ఆదేశాలు అందాయని చెబుతోంది. 

భవిష్యత్తులో రూ.500 నోట్లు కూడా…

ఎస్బీఐ తాజా నిర్ణయం ప్రకారం.. ఆ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలలో ఇకమీదట రూ.2 వేల నోటు అందుబాటులో ఉండదు. ఇందులో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను దాదాపు అన్ని ఏటీఎంల నుంచి బ్యాంకు తొలగించింది.

అంతేకాదు, మున్ముందు రూ.500 నోటును కూడా ఆపేసి.. కేవలం రూ.100, రూ. 200 నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్‌బీఐ యోచిస్తోంది.

ఇకమీదట తమ బ్యాంకు ఏటీఎంలలో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో వినియోగదారుల సౌకర్యార్థం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కూడా పెంచాలని బ్యాంకు భావిస్తోంది. మెట్రో నగరాల్లో 10 సార్లు.. ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.