ఇక డెబిట్ కార్డ్ లేకుండానే క్యాష్! దేశంలోనే తొలిసారిగా.. ఎస్బీఐ ఏటీఎంలో!

4:40 pm, Sat, 16 March 19
SBI launches cardless ATM withdrawal with YONO Cash, Newsxpressonline

హైదరాబాద్‌: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను ప్రవేశపెట్టింది. యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500కు పైగా ఎస్‌బీఐ ఏటీఎంల్లో కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేయొచ్చని బ్యాంక్‌ వెల్లడించింది.

దేశంలోనే తొలి బ్యాంక్‌గా..

దీంతో దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ గా రికార్డు సృష్టించింది. ఈ సదుపాయం కలిగిన ఏటీఎంలను ‘యోనో క్యాష్‌ పాయింట్‌’గా పరిగణించనున్నారు. అయితే, యోనో యాప్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత లావాదేవీ పూర్తి చేయడానికి ఆరు అంకెల యోనో క్యాష్‌ పిన్‌ పెట్టుకోవాలి. లావాదావీ పూర్తి చేయడానికి వినియోగదారుడి మొబైల్‌కు ఆరు అంకెల రిఫరెన్స్‌ సంఖ్య ఎస్‌ఎంఎస్‌ ద్వారా వస్తుంది. పిన్‌, రిఫరెన్స్‌ సంఖ్య వచ్చిన 30 నిమిషాల్లోగా నగదు ఉపసంహరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదును డ్రా చేసుకోవచ్చు.