‘మీరు ఏదైనా సాధించగలరు’.. యువతకు సుందర్ పిచాయ్ సందేశం

6:06 pm, Mon, 8 June 20

వాషింగ్టన్: నేటి యువత ఎంతటి కష్టం వచ్చినా ఎదురు నిలవాలని, దేన్నైనా సాధించే ఆత్మస్థైర్యంతో ఉండాలని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు.

నేటి యువతకు సుందర్ పిచాయ్ ఇటీవల ఓ సందేశం అందించారు. తన యూట్యూబ్ చానల్ ద్వారా పిచాయ్ ఈ సందేశం అందించారు.

ప్రతి ఒక్కరూ జీవితంలో కచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని, అందులో ఎటువంటి అనుమానం లేదని, చరిత్ర కూడా ఇదే విషయం చెబుతోందని వివరించారు.

తాను కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించానని, తనను అమెరికా పంపించేందుకు తప తండకని ఏడాది సంపాదనతో విమాన టికెట్ కొన్నారని చెప్పారు.

అమెరికా చాలా ఖరీదైన దేశమని, ఇక్కడి నుంచి ఇండియాకు ఫోన్ చేయాలంటేనే నిముషానికి రెండు డాలర్లు ఖర్చవుతుందని వివరించారు.

ఓ బ్యాగ్ కొనుక్కునేందుకు తండ్రి నెల జీతం ఖర్చుచేయాల్సి వచ్చేదని, అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని, ప్రతి ఒక్కరూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని చెప్పారు.

కొత్త తరానికి పాత తరం బాటలు వేస్తుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందులో ఒక భాగమని, తాను వయసులో ఉన్నప్పుడు టెక్నాలజీ అంటే విచిత్రంగా ఉండేదని చెప్పుకొచ్చారు.

కానీ ప్రస్తుత తరానికి అది చాలా అందుబాటులో ఉందని, దీని సాయంతో యువత మరింత సాధించాలని ఆకాంక్షించారు.