ఎస్‌వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌పై కేసులో కీలక మలుపు!

- Advertisement -

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర భక్తిచానల్ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌పై విజిలెన్స్ విచారణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదేశించింది. మహిళా ఉద్యోగితో పృథ్వీ అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. తన పరువు ఇప్పటికే పోయిందని వాపోతున్న మహిళ, ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు.

దీంతో ఏం చేయాలో అర్థం కాక విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఫోన్ ఆడియోతో చట్టపరమైన చర్యలు సాధ్యం కాదని అంటున్నారు. బాధితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం కష్టమని చెబుతున్నారు. ఫిర్యాదు లేకుండా కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మహిళా ఉద్యోగినితో రొమాంటిక్‌గా మాట్లాడి దొరికిపోయిన పృథ్వీరాజ్ పార్టీ అధిష్ఠానం ఒత్తిడితో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ ఆడియో టేపులో పృథ్వీ మాట్లాడుతూ.. నువ్వు గుండెల్లో ఉన్నావ్ అని పృథ్వీ అంటే.. ఆ మాట మీరు భలే చెప్తారు సార్ అని ఆ మహిళ బదులిచ్చింది.

కామెడీలు చేయకు.. నిజంగా చెబుతున్నా.. వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నా. కానీ కెవ్వుమని అరుస్తామని ఆగిపోయానని పృథ్వీ అనడం ఆ టేపులో స్పష్టంగా వినిపించింది. నువ్వంటే నాకిష్టం లవ్ యూ అన్న మాటలు కూడా అందులో ఉన్నాయి.

జీతం పెంచుతానని, జాబ్ పర్మనెంట్ చేస్తానని చెప్పి పృథ్వీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. పృథ్వీ అక్రమాలకు పాల్పడ్డారని, ఎలాంటి అర్హత లేకున్నా పలువురిని ఎస్వీబీసీ ఉద్యోగులుగా తీసుకున్నారని ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియో టేప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే ఇప్పటివరకు వేధింపులపై ఎటువంటి కేసు నమోదు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

- Advertisement -