హోండా నుంచి యాక్టివా 6జీ స్కూటర్.. అద్భుతమైన ఫీచర్లు!

4:43 pm, Fri, 17 January 20

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

భారత్ స్టేజ్-6 (బీఎస్-6) ప్రమాణాలతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌లోని సరికొత్త ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన ఇంజిన్‌తోపాటు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సస్పెన్షన్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

హోండా యాక్టివా 6జీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒకటి స్టాండర్డ్ కాగా, రెండోది డీలక్స్. స్టాండర్డ్ స్కూటర్ ధర రూ.63,912(ఢిల్లీ ఎక్స్ షోరూం), హోండా 5జీతో పోలిస్తే రూ.7,978 అధికం.

యాక్టివా 6జీ డీలక్స్ స్కూటర్ ధర రూ.65,412 (ఢిల్లీ ఎక్స్ షోరూం). యాక్టివా 5జీ డీలక్స్ ధరతో పోలిస్తే రూ.7,613 అధికం. యాక్టివా 5జీ 8 రంగుల్లో అందుబాటులో ఉండగా, యాక్టివా 6జీ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

హోండా యాక్టివా 6జీ ఫీచర్లు: డీసీ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బయటనే పెట్రోలు ట్యాంకు మూత, సీటు కింద స్టోరేజీకి, ఫ్యూయల్ మూత కోసం డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ స్విచ్ వంటివి ఉన్నాయి.

గత మోడల్ కంటే 10 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, విశాలమైన సీటు, పొడవాటి వీల్ బేస్, 18 లీటర్ల స్టోరేజీ స్పేస్ వంటివి యాక్టివా 6జీలో ప్రధాన ఆకర్షణలు.