వీయూ నుంచి సినిమా టీవీ.. షియోమీ, వన్‌ప్లస్‌కు గట్టి పోటీ!

7:58 pm, Wed, 15 January 20

న్యూఢిల్లీ: ఇండియన్ టెలివిజన్ మేకర్ వీయూ నుంచి మరో సరికొత్త టీవీ వచ్చేసింది. ఈసారి నేరుగా షియోమీ, వన్‌ప్లస్, ఎల్‌జీ, శాంసంగ్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే ఉద్దేశంతో అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టీవీ పేరు ‘వీయూ సినిమా టీవీ రేంజ్’.

వీయూ సినిమా రేంజ్ టీవీ ధర రూ.26,999 మాత్రమే. 4కే రిజల్యూషన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, ఆండ్రాయిడ్ టీవీ 9పై ఓఎస్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ టీవీ మూడు సైజుల్లో అందుబాటులో ఉంది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

అన్ని మోడళ్లు 4కే రిజల్యూషన్స్‌లోనే…

వీయూ సినిమా టీవీ రేంజ్‌లో అన్ని మోడళ్లు 4కే రిజల్యూషన్స్‌లోనే ఉన్నాయి. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, ఆండ్రాయిడ్ టీవీ9 పై ద్వారా స్మార్ట్ కనెక్టివిటీ, వివిధ యాప్‌లు, స్ట్రీమింగ్ సర్వీస్ సపోర్ట్ కలిగి ఉంది. అంటే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటివి కూడా ఉన్నాయి. వీయూ టీవీలో పిక్సెలియం గ్లాస్‌ టెక్నాలజీని ఉపయోగించారు.

వీయూ టీవీలో సౌండ్ సిస్టం అద్భుతంగా ఉందనడంలో సందేహం లేదు. 40 వాట్స్ సౌండ్ అవుట్ పుట్, ఫ్రంట్ ఫైరింగ్ సౌండ్‌బార్ ఉన్నాయి. వీయూ సినిమా టీవీ రేంజ్‌లో అన్ని టీవీల్లోనే ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. మూడు వేరియంట్లలో సైజు మాత్రమే తేడా.

వీయూ సినిమా టీవీ 43అంగుళాల మోడల్ ధర రూ.26,999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.29,999 మాత్రమే. 55 అంగుళాల వీయూ సినిమా టీవీ ధర రూ.33,999. ఈ నెల 18 నుంచి అమెజాన్ ఇండియాతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు.