బంగ్లాదేశ్‌ను వణికించిన చాహర్.. భారత్‌దే టీ20 సిరీస్

- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. మొహమ్మద్ నైమ్ ఒంటరి పోరాటం చేసినా.. చాహర్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. చివరి టీ20లో 30 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు దీపక్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్‌ (0)లను వెనక్కి పంపాడు. చాహర్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని లిటన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సౌమ్య సర్కార్‌ గోల్డెన్ డక్‌ అయ్యాడు.

12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మొహమ్మద్ నైమ్ (81), మొహమ్మద్ మిథున్‌ (27) లు జోరు పెంచారు. భారత బౌలర్లకు చిక్కకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో నైమ్ 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే స్కోర్ వద్ద మిథున్, రహీమ్ (0) ఔట్ అవ్వడంతో బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపై నైమ్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా వికెట్ల పతనం కొనసాగింది. యుజ్వేంద్ర చాహల్, దూబేలకు తోడు ఇన్నింగ్స్ చివరలో చాహర్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో బంగ్లా ఆలౌట్ అయింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ షఫియుల్ ఆదిలోనే భారీ షాక్ ఇచ్చాడు. రెండు పరుగులకే ఓపెనర్ రోహిత్‌ శర్మను పెవిలియన్ పంపాడు. జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (19)ను ఔట్ చేశాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఆచితూచి ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

క్రీజులో కుదురుకున్న అనంతరం దూకుడు పెంచిన రాహుల్, శ్రేయాస్ ఎడాపెడా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరూ కలిసి 41 బంతుల్లోనే 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే లోకేశ్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ఒకవైపు రిషబ్ పంత్ (6) తడబడినా.. శ్రేయాస్ శివమెత్తాడు. అఫిఫ్ హొసైన్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

శ్రేయాస్ ధాటిగా ఆడుతూ కేవలం 27 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో టీ20ల్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోర్ వేగం పెరిగే క్రమంలో పంత్ నిష్క్రమించాడు. ఆ వెంబడే 17వ ఓవర్లో శ్రేయాస్ కూడా ఔట్ అయ్యాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో మనీశ్ పాండే 13 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.

- Advertisement -