అమెజాన్‌కు గట్టి షాక్! ఈ-కామర్స్ రంగంలోకి మరో దిగ్గజం!!

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు షాక్ ఇచ్చేందుకు మరో దిగ్గజ సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెజాన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌లు మెగా డీల్‌ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ ఫేస్‌బుక్ కూడా అమెజాన్‌ను దెబ్బతీయడానికి భారత ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం చేయబోతోంది.

- Advertisement -

వాట్సాప్‌ ద్వారా ఇప్పటికే దేశీయ పేమెంట్‌ సర్వీసుల్లోకి ప్రవేశించిన ఫేస్‌బుక్‌, త్వరలోనే ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఈ కంపెనీ పలు బ్రాండులు, వ్యాపారస్తులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూన్‌ నుంచి ప్రారంభించబోతున్న బిజినెస్‌-టూ-కన్జ్యూమర్‌ ట్రాన్సాక్షన్స్‌ టెస్టింగ్‌ ఈ నెల నుంచే మొదలైనట్టు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ తన మార్కెట్‌ ప్లేస్‌లో ఉత్పత్తులను అప్‌లోడ్‌ చేయడం కోసం మరిన్ని టూల్స్‌ను ఏర్పాటు చేయనుందని, ఇన్వెంటరీ, ఆర్డర్లను నిర్వహించనుందని, ఈ ఏడాది చివరికల్లా పేమెంట్స్‌ను కూడా జత చేయనుందని సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, తన వినియోగదారులను అమ్మకపుదారుల ఫేస్‌బుక్‌ పేజీలకు, వెబ్‌సైట్లకు మరలిస్తోంది.

నిజానికి ఫేస్‌బుక్‌ ఆరు నెలల క్రితమే కన్జ్యూమర్‌-టూ-కన్జ్యూమర్‌ ఇంటర్‌ఫేస్‌ కోసం మార్కెట్‌ ప్లేస్‌ను తీసుకొచ్చింది. ప్రతి నెల ఈ మార్కెట్‌ ప్లేస్‌ను 70 దేశాల్లో 800 మిలియన్‌ మంది యూజర్లు సందర్శిస్తూ కొనుగోళ్లు, అమ్మకాలు చేపడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సోషల్‌మీడియా దిగ్గజం బిజినెస్‌-టూ-కన్జ్యూమర్‌ మోడల్‌ను కూడా లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది.

2026 నాటికి దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్‌ స్లాన్లీ అంచనా. మరోవైపు ప్రజల అవసరాలను చేరుకోవడానికి ఫేస్‌బుక్ అహర్నిశలూ కృషి చేస్తుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ-కామర్స్‌ ద్వారా కమ్యూనిటీస్‌ కనెక్ట్‌ కావడం కోసం ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటామని తెలిపారు.

- Advertisement -