స్టార్టప్‌లపై కేంద్రం వరాల జల్లు.. నిర్వచనంలో మార్పు, ఏంజిల్ ట్యాక్స్ నిబంధనల్లోనూ సడలింపు…

7:15 pm, Tue, 19 February 19
startups-defination-widened

న్యూఢిల్లీ: స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను సరళీకరించింది. స్టార్టప్ నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చింది. ఇకనుంచి ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించిన (రిజిస్ట్రేషన్) నాటి నుంచి 10 ఏళ్ల వరకు దానిని స్టార్టప్‌గానే పరిగణిస్తారు. గతంలో ఈ గడువు 7 ఏళ్లు మాత్రమే ఉండేది. అయితే స్టార్టప్‌లు కచ్చితంగా డిపార్ట్‌మెంట్‌ ఫర్‌‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ వద్ద నమోదవ్వాలి.

అలాగే వీటి వార్షిక టర్నోవర్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల లోపే ఉండాలి. రూ.100 కోట్లు దాటితే మాత్రం వాటిని స్టార్టప్‌‌లుగా పరిగణించరు. ప్రస్తుతం ఈ టర్నోవర్ పరిమితి రూ.25 కోట్లుగా ఉంది. తాజా సవరణల ప్రకారం ఈ టర్నోవర్‌ను రూ.100 కోట్లకు పెంచారు. అలాగే స్టార్టప్‌లకు కేంద్రం ఇంకా పలు వరాలు ప్రకటించింది.

స్టార్టప్‌లకు సంబంధించి ఏంజల్‌ ట్యాక్స్‌ నిబంధనలను సరళీకరించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. తాజాగా రూ.25 కోట్ల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు కల్పించింది. ప్రస్తుతం ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధులు సహా స్టార్టప్ మొత్తం పెట్టుబడులు రూ.10 కోట్లు లోపలే ఉంటేనే ఈ పన్ను మినహాయింపు సౌకర్యం ఉంది. ఇకమీదట రూ.25 కోట్ల వరకు పెట్టుబడులపై ఈ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

అలాగే రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన లిస్టైడ్ కంపెనీ, ప్రవాసులు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (కేటగిరి 1) ఒక స్టార్టప్‌లో పెట్టుబడి పెడితే రూ.25 కోట్ల పరిమితిని దాటినా కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 (2) (7బి) కింద మినహాయింపు పొందవచ్చు. అయితే స్థిర ఆస్తి, రూ.10 లక్షలపైన విలువైన ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి మాత్రం చేయకూడదు.