ఎన్నాళ్లకెన్నాళ్లకు!: భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇలా…

stock-market-raise
- Advertisement -

దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్ల ప్రభావంతో గురువారం రికార్డు స్థాయిలో నష్టాల బారిన పడిన స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బాగా పుంజుకున్నాయి. ఒక్కరోజులో సెన్సెక్స్ ఈ స్థాయి లాభాలను ఆర్జించడం గడచిన రెండేళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ముడిచమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఆరంభంలోనే…

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 10,350 పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. అప్పటి నుంచి ఆసాంతం సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఒక దశలో 700 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ 34,800 స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి…

సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 732 పాయింట్లు లాభపడి 34,733 వద్ద, నిఫ్టీ 238 పాయింట్ల లాభపడి 10,472 వద్ద ఉన్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 48 పైసలు బలపడి 73.64 వద్ద కొనసాగుతోంది. ఐటీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బ్యాంక్‌లు, ఆటోమొబైల్స్‌, ఎనర్జీ, మెటల్స్‌ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.

ఎన్‌ఎస్‌ఈలో ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, మహింద్రా అండ్ మహింద్రా, హెచ్‌పీసీఎల్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఇక టీసీఎస్ , హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అధికంగా నష్టపోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.

- Advertisement -