బుల్లితెర యువ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య! ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ పెట్టి…

10:23 pm, Tue, 26 May 20

ఇండోర్: ‘క్రైమ్ పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరీ దుర్గా’ వంటి టీవీ షోలలో నటించి పేరు తెచ్చుకున్న యువ నటి ప్రేక్ష మెహతా (25) సోమవారం రాత్రి ఇండోర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమా ‘ప్యాడ్ మ్యాన్’లోనూ ప్రేక్ష నటించింది. సోమవారం రాత్రే ఆమె ఉరి వేసుకోగా, మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు.

వెంటనే అప్రమత్తమైన ప్రేక్ష తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

ప్రేక్ష ఆత్మహత్యకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన మెసేజ్ ఆమె అనుభవిస్తున్న వ్యధను బయటపెట్టింది.

‘‘సబ్‌సే బురా హోతా హై సప్నోకా మార్ జానా (మీ కలలు కల్లలైనప్పుడు దానికంటే దరిద్ర మరోటి ఉండదు) అని పేర్కొంది.

ప్రేక్ష చివరిసారి నాలుగు రోజుల క్రితం ఓ సెల్ఫీ ఫొటోను అభిమానులతో పంచుకుంది. దానికి పాపులర్ సాంగ్ అయిన ‘అగర్ తుమ్ సాత్ హో.. ’ పాటను జోడించింది.

రెండేళ్ల క్రితమే ముంబైలో అడుగుపెట్టిన ప్రేక్ష.. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తనకు పని ఉండదేమోనన్న బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.