పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటనతో తల్లడిల్లుతున్న అతడి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
సుశాంత్ ఆత్మహత్య వార్తను జీర్ణించుకోలేక అతడి సమీప బంధువు ఒకరు కన్నుమూశారు. సోమవారం ముంబైలో సుశాంత్ అంత్యక్రియల సమయంలోనే ఈ సమాచారం అందింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.
కొన్ని నెలలుగా మనో వ్యాకులతతో బాధపడుతున్న సుశాంత్ ఆ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే.. సుశాంత్ మరణ వార్త తెలియగానే బీహార్లో ఉంటోన్న అతడి సోదరుడు అంబేంద్ర సింగ్ భార్య సుధాదేవి తీవ్ర మనోవేదనకు గురైంది.
ఇంట్లోని వారు చెప్పినా వినకుండా సుధాదేవి నిద్రాహారాలు మాని రోదించేది. ఈ క్రమంలో ఆమె కూడా సోమవారం సాయంత్రం మరణించినట్లు కుటుంబ సభ్యుల ద్వారా కబురు అందింది.
అదే సమయంలో ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఒకపక్క ఇది జరుగుతుండగానే మరోపక్క విషాద వార్త చెవిన పడడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.