కృష్ణ జింకల వేట కేసు: జోధ్‌పూర్ కోర్టుకు నటుడు సల్మాన్ ఖాన్

- Advertisement -

జోధ్‌పూర్: బాలీవుడ్ ప్రముఖ నటుడు, కృష్ణ జింకలను వేటాడిన కేసులో నిందితుడైన హీరో సల్మాన్‌ఖాన్ నేడు జోధ్‌పూర్ కోర్టుకు రానున్నాడు. జోధ్‌పూర్ కోర్టు విచారణకు సల్మాన్‌ఖాన్‌ వస్తున్న నేపథ్యంలో అతన్ని హతమారుస్తామంటూ గ్యారీ షూటర్ పేరిట ఫేస్‌బుక్‌లో హెచ్చరికలు జారీ చేశాడు.

సల్మాన్‌ఖాన్‌ ఫోటోకు రెడ్ క్రాస్ మార్కు చేసి 007 లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట ఈ హెచ్చరికను పోస్టు చేశారు. సల్మాన్‌ఖాన్‌ కృష్ణజింకలను వేటాడిన కేసులో కోర్టుకు హాజరుకానున్న దృష్ట్యా తాము ఈ హెచ్చరికలపై ముందుజాగ్రత్త చర్యగా దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ డీ సింగ్ చెప్పారు.

సల్మాన్ కోర్టుకు రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసును జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా బెయిలుపై విడుదలయ్యారు. కోర్టుకు సల్మాన్ ఖాన్ హాజరుకాకుంటే అతని బెయిలు రద్దు చేస్తానని సెషన్స్ కోర్టు జడ్జి చంద్రకుమార్ సొంగార విచారణలో పేర్కొనడంతో ఆయన కోర్టుకు రానున్నారు.

 
 
 
- Advertisement -