వెండితెరపై రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ సాహసకృత్యం! హీరో పాత్ర‌కు జాన్ అబ్రహాం?

4:45 pm, Tue, 5 March 19
abhinandan, john abraham, Newsxpressonline

ముంబై: ఇది బయోపిక్‌ల కాలం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా రియల్ లైఫ్ స్టోరీల ఆధారంగా తీస్తోన్న సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లు తెరకెక్కి మంచి వసూళ్లు రాబట్టాయి. అలాగే బాలీవుడ్‌లోనూ తాజాగా కంగనా రౌనత్ నటించిన మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ కూడా హిట్ సినిమాగా నిలిచింది.

వార్ సినిమాలకూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా యూరీ ఘటన నేపథ్యంలో వచ్చిన సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. గతంలో వచ్చిన ఘాజీ, ఆ తరువాత అదే దర్శకుడు తీసిన అంతరిక్షం.. ఇవన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయనే చెప్పాలి. సైన్యం, యుద్ధ రంగానికి సంబంధించిన సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంటుంది. బాలీవుడ్‌లో గతంలో వచ్చిన బోర్డర్, ఎల్వోసీ తదితర చిత్రాలు బాగానే ఆడాయి.

అభినందన్ సాహసకృత్యం ఆధారంగా…

తాజాగా భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అయిన అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సాహసకృత్యం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. జమ్మూ కశ్మీర్ జిల్లాలోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర దాడి జరిపిన తరువాత భారత-పాకిస్తాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడం.. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి వాటిని సమూలంగా ధ్వంసం చేయడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను వెంటాడుతూ వెళ్లిన అభినందన్ వర్ధమాన్ మిగ్ యుద్ధ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, పాక్ సైన్యానికి పట్టుబడడం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం శారీరకంగా, మానసికంగా ఎంత వేధించినా అభినందన్ అధైర్యపడలేదు, పైగా దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.

అనంతరం మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు కూడా. అలా రెండు రోజులపాటు పాక్ సైన్యం చెరలో బందీగా గడిపిన అభినందర్ భారత ప్రభుత్వం చొరవతో విడుదలై క్షేమంగా స్వదేశానికి చేరుకున్నాడు.

మరోవైపు యావత్ భారతీయులు అతడి రాక కోసం ఎదురుచూశారు. ఈ విషయం తెలిసి తీవ్ర ఉద్వేగానికి గురైన క్షణాలు ప్రతి భారతీయుడికి అనుభవమే. ఈ నేపథ్యంలో పైలట్ అభినందన్ వర్ధమాన్ జీవిత విశేషాలు తెలుసుకోవాలనే ఆరాటం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో అభినందన్ బయోపిక్ తెరకెక్కనుంది.

రియల్ హీరో పాత్రలో జాన్ అబ్రహాం?

ఇప్పటికే ఈ దిశగా అభినందన్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వివిధ టైటిల్స్ కూడా రిజిస్టర్ అయినట్లు సమాచారం. మరోవైపు రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ పాత్రను సినిమాలో ఎవరు పోషిస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో ఓ మీడియా సమావేశంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంకు విలేకరులు ఓ ప్రశ్న వేశారు. అభినందన్ పాత్ర పోషించేందుకు మీరు రెడీయా? అని అడగ్గా.. అందుకు జాన్ అబ్రహాం స్పందిస్తూ.. చాన్స్ రావాలేగానీ కచ్చితంగా చేస్తానని వ్యాఖ్యానించాడట. యూరీ దాడి ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్ ఆధారంగా పేరుతో తెరకెక్కి ఈ మధ్యనే ‘యూరీ’ విడుదలైన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ జరిపిన ఎయిర్ స్ట్రయిక్ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం కావడం భారతీయ ప్రేక్షకులకు సంతోషదాయకమే.