‘మణికర్ణిక’లో మాయాజాలం, బొమ్మ గుర్రంపై కంగనా స్వారీ, వీడియో వైరల్, ట్రోలింగ్ షురూ!

10:50 pm, Fri, 22 February 19
kangana-ranaut-manikarnika-movie-horse-riding

ముంబై: వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా రౌనత్ నటించిన చిత్రం ‘మణికర్ణిక’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కంగనా కష్టపడి అనేక యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. మొన్న జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది.

దర్శకుడు క్రిష్‌తో విభేదాలు…

కొంత భాగం చిత్రీకరణ జరిగిన తరువాత ఈ చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకోగా కంగనాయే ముందుకొచ్చి చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. మధ్యలోనే క్రిష్ నిష్క్రమించడానికి కంగనాతో విభేదాలు తలెత్తడమే కారణమంటూ బాలీవుడ్ కోడై కూసింది. ఆ తరువాత చిత్రం విడుదలై ప్రేక్షకుల ప్రసంశలు అందుకోవడంతో మళ్లీ చిత్రం క్రెడిట్ కోసం కూడా వీరిద్దరూ రచ్చకెక్కారు.

70 శాతం చిత్రాన్ని తానే షూట్ చేశానని క్రిష్ అంటే.. లేదు లేదు.. క్రిష్ చేసింది కేవలం 30 శాతమే, మిగతాదంతా నేనే డైరెక్ట్ చేశానంటూ కంగనా పేర్కొంది.

బొమ్మ గుర్రంపై స్వారీ…

ఈ విషయం అటుంచితే.. పాపం.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీగా నటించిన కంగనా రౌనత్ మాత్రం ఓ విషయంలో తీవ్రంగా అభాసుపాలైంది. తాజాగా మణికర్ణిక చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన తరువాత పలువురు ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది నెటిజెన్లు ఊరుకోకుండా కంగనాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. కంగనా రౌనత్ గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటీష్ సైనికులతో పోరాడే సన్నివేశం ఒకటి ఈ చిత్రంలో ఉంది. ఈ వీడియో బయటికొచ్చే వరకు అదంతా నిజమనే నమ్మేశారు అందరూ. కానీ ఆ సన్నివేశంలో కంగనా స్వారీ చేసింది నిజమైన గుర్రం కాదు. అదొక మెకానికల్ గుర్రం.

అది కదులుతూ ఉండగా దానిపైన కూర్చుని ఉన్న కంగనా కత్తి తిప్పుతూ ఉంటుంది. ఆ గుర్రం పక్కనే కెమెరాను రోల్ చేస్తూ.. నిజంగానే యుద్ధ భూమిలో బ్రిటీష్ సైనికులను చీల్చి చెండాడుతున్నట్లు చిత్రీకరించారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్…

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పలువురు నెటిజన్లు కంగనాను ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కంగనా రౌనత్ ఇదే గుర్రంపై వెళ్లి పాకిస్తాన్‌తో కూడా యుద్ధం చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో నెటిజన్ ‘ఫన్నీకర్ణిక’ అంటూ కామెంట్ పెట్టింది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం కంగనాకు మద్దతు పలుకుతూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా షూటింగ్ అంటే అలాగే ఉంటుందని, హాలీవుడ్ చిత్రాల్లోనూ ఈ తరహా సాంకేతికతను ఉపయోగిస్తారని, ఏ సీను ఎలా తీశారంటూ విమర్శించేకంటే, మొత్తంమీద సినిమా బాగుందా లేదా అన్నదే చూడాలని సెలవిస్తున్నారు. ఈ సినిమా కోసం కంగనా చెమటోడ్చిందంటే.. ఏదో అనుకున్నాంగానీ అసలు కథ ఇదన్నమాట అనేవారూ లేకపోలేదు.