సుశాంత్‌ది ఆత్మహత్యా? లేక పక్కాగా చేసిన హత్యా?: ప్రశ్నించిన కంగనా, విలేకరులపైనా విసుర్లు…

sushant-singh-rajput-believed-those-who-called-him-worthless-says-kangana-ranaut
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా? లేక పక్కాగా చేసిన హత్యా? అని నటి కంగనా రౌనత్ ప్రశ్నించారు. 

‘‘అతడు చేసిన ఒకే ఒక తప్పు.. ‘సుశాంత్ పనికిరాడు’ అనుకున్న వ్యక్తులను నమ్మడమే..’’ అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారామె.

- Advertisement -

ఆదివారం ఉదయం సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతడి మృతిపై బాలీవుడ్ ప్రముఖులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, అనుష్క శర్మ, దీపికా పదుకొనె, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అభిషేక్ కపూర్, పరిణితి చోప్రా వీరిలో ఉన్నారు. 

బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. సుశాంత్‌ని బాలీవుడ్‌లో చాలామంది చిన్నచూపు చూశారని ఆరోపించారు. 

సుశాంత్ ఆత్మహత్యకు అతడి ‘బలహీన మనసు’ కారణమంటూ రాస్తోన్న మీడియాను కూడా ఆమె విమర్శించారు. 

‘‘సెలబ్రిటీలు మానసిక ఒత్తిడితో లేదా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నామని చెప్పినప్పుడు మీడియా వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి.. అంతేకానీ వారికి మరిన్ని కొత్త సమస్యలు సృష్టించకూడదు..’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, దేశవ్యాప్తంగా ర్యాంక్ సాధించిన ఓ ఉత్తమ విద్యార్థి మైండ్ బలహీనంగా ఉంటుందని ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించారు. 

సుశాంత్ తొలి సినిమా ‘కై పో చే’ను బాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకుని, ఎందుకు ప్రోత్సహించలేదు అంటూ నిలదీశారు. 

భయంకరమైన ‘గల్లీబాయ్’ సినిమా అన్ని అవార్డులు ఎలా గెలుచుకుంది? మరి అద్భుతమైన ‘చిచ్చోరే’ సినిమాని ఎందుకు పట్టించుకోలేదు? నా నటనను, నా దర్శకత్వ ప్రతిభను ఎందుకు మెచ్చుకోలేదు? అని కూడా కంగన ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా పాత్రికేయుల వైఖరిపైనా కంగన కొన్ని విసుర్లు విసిరారు. సుశాంత్ గురించి కొంతమంది పాత్రికేయులు లేనిపోని వార్తలు రాశారంటూ మండిపడ్డారు.

అతడు డ్రగ్స్ వాడుతున్నాడని కూడా గతంలో రాశారని, మరి సంజయ్ దత్ విషయమేంటి? ఆయన డ్రగ్స్‌కు బానిస కాలేదా? అని కంగన ప్రశ్నించారు. 

ఈ రకం విలేకరులు తనకూ సందేశాలు పంపుతుంటారని, ‘మీరేం అనుకుంటున్నారు?’ అంటూ అడుగుతుంటారని దుయ్యబట్టారు.

‘‘నాకు లేనిపోని ఆలోచనలు మీరెందుకు తెప్పిస్తున్నారు? దాని వల్ల మీకు ఉపయోగం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా? లేక పక్కాగా చేసిన హత్యా? అతడు చేసింది ఒకే ఒక తప్పు.. అతడ్ని అసమర్థుడిగా భావించే వ్యక్తులను నమ్మడమే.. అంటూ కంగన వ్యాఖ్యానించారు.

‘చరిత్రను ఎవరు రాయాలనే విషయం మనమే నిర్ణయించాలి..’ అని తన తల్లి నేర్పిన మాటలను సుశాంత్ మరిచిపోయాడు.. అంతే..’’ అంటూ ఆమె తనలోని భావావేశాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -