గ్రేట్: రూ.200 కోట్ల క్లబ్‌లో ‘కేజీఫ్’! శాండిల్‌వుడ్‌లో తొలిసారిగా, ఓవర్సీస్‌లోనూ రికార్డు కలెక్షన్లు…

1:07 pm, Sat, 12 January 19
yash_in_kgf-movie

బెంగళూరు: యశ్, శ్రీనిధి శెట్టిలు నటించిన కేజీఎఫ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లు రాబట్టిన మొదటి కన్నడ సినిమాగా రికార్డు స్థాపించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ అదరగొట్టే కలెక్షన్లు రాబడుతూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది.

జీరో, సింబాలను తట్టుకుని మరీ…

ఈ సినిమా హిందీ వెర్షన్ విషయానికొస్తే.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’, రణ్‌వీర్ సింగ్‌ నటించిన ‘సింబా’ సినిమాలను తట్టుకుని మరీ రూ.40 కోట్లు వసూలు చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. విడుదలైన రోజు నుంచే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది.

విడుదలైన రెండు వారాల్లోనే…

విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా కన్నడ సినీ చరిత్రలో ఏ సినిమా సాధించని ఘనతను సాధించింది. అన్నీ వర్షన్లు, ఓవర్‌సీస్ కలిపి ఈ సినిమా రెండు వారాల్లో రూ.150 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యశ్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్…

అంతేకాదు, కేజీఎఫ్ అనూహ్య విజయం ఆ సినిమా హీరో యశ్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడంతో యశ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక కేజీఎఫ్ సెకెండ్ పార్ట్ ఇంతకంటే డబుల్ కలెక్షన్లు రాబడుతుందని అంటున్నారు.

బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. కేజీఎఫ్‌ సంచలన విజయం కన్నడ చిత్ర పరిశ్రమ భారీ కలలకు రెక్కలు తొడిగిందని, అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు.