‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ వసూళ్లు ఎంతంటే.?

5:29 pm, Fri, 11 January 19
kathanayakudu

kathanayakudu

హైదరాబాద్: తెలుగువారి అభిమాన సినీనటులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదలైన బుధవారం రోజున రూ.21కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ తొలి రోజు రూ. 7.61కోట్లు వసూలు చేసింది. అత్యధికంగా గుంటూరులో రూ. 2.04 కోట్ల షేర్ వసూలు చేయగా, నైజాంలో రూ. 1.72 కోట్లు రాబట్టింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.77కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా, రెండో రోజు వసూళ్ల పూర్తి వివరాలు రావాల్సి ఉంది. సంక్రాంతి పండగ సెలవులు, వారాంతం నేపథ్యంలో వసూళ్లు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు ప్రజల విజయం

సినిమాకు మంచి టాక్ రావడంతోపాటు వసూళ్లు కూడా బాగుండటంతో నిర్మాణ సంస్థ సినీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ‘ఇది చారిత్రాత్మక విజయం, తెలుగు ప్రజల విజయం, తెలుగు సినిమా విజయం..’ పేర్కొంది.

కథనాయుడుకు సినిమాలో యన్.టి.ఆర్‌లా ఆయన తనయుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ నిర్మించారు. వారాహి చలన చిత్రం సంస్థ ఈ సినిమాను సమర్పించింది. ఈ సినిమాలో బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడిగా రానా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, నాగేశ్వరరావుగా సుమంత్ నటించారు.