కొత్త తరహా రొమాంటిక్ కామెడీ ( ‘చి.ల‌.సౌ’ మూవీ రివ్యూ )

chi-la-sow
- Advertisement -

chi la sow

సాధారణంగా సుశాంత్ సినిమా అంటే అవాయిడ్ చేస్తూంటాను. కుర్రాడు బాగానే ఉన్నా.. అతని కథల ఎంపిక మీద నాకు నమ్మకం తక్కువ. అయితే ఈసారి ‘చి.ల‌.సౌ’ ట్రైలర్స్, టీజర్స్ చూసినప్పటినుంచి ఈ సినిమాకు వెళ్లాలనే ఆలోచన బలంగా కలిగింది. అయితే ఏమో ‘కబాలి’ సినిమాలాగ టీజర్ చూపించి.. థియేటర్‌కు వెళ్లిన వాళ్లకు నాలుక బయిటపెట్టి వెక్కిరిస్తాడేమో అనే సందేహం ఓ పక్కన పీకింది. దాంతో కాస్త లేటుగా ఈ సినిమాని చూశా.  అయితే సినిమా చూశాక మాత్రం.. మా ఫ్యామీలీని కూడా తీసుకెళ్లి ఉంటే వాళ్లు కూడా ఎంజాయ్ చేద్దురుకదా అనే ఫీల్ కలిగింది.

- Advertisement -

కథేంటి..

ఇంకో ఐదేళ్ల దాకా పెళ్లి చేసుకోనని, తనకు ఖరీదైన కారు కొనుక్కోవటం, యూరప్ ట్రిప్ వేయటం వంటి బోలెడు గోల్స్  ఉన్నాయని గోలెత్తిపోయే కుర్రాడికి… తన కుటుంబం, తన తల్లి ఆరోగ్యంగా ఉండటమే తన గోల్స్ అని, తన వాళ్ల కోసం తక్షణమే  పెళ్లి చేసుకోవటానికి సిద్దపడే భాధ్యతలు కలిగిన  సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయికు మధ్య రిలేషన్ ఏర్పడటం చాలా కష్టం. ఎందుకంటే మొదటి మీట్ లోనే వీళ్లద్దరూ విడిపోయే ప్రమాదం ఉంది. అయితే విధికు వీరిద్దరిని కలపాలని సరదా ఉంటే …అది… ‘చి.ల‌.సౌ’సినిమా అవుతుంది.

susanthఅర్జున్‌(సుశాంత్‌) సల్మాన్ ఖాన్ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడు.  కెరీర్ పరంగా బాగానే సెటిలైన అతన్ని  పెళ్లి చేసుకోమని, వయస్సు మీరితే పెళ్లిళ్లు అవటం కష్టమని ఉన్న వాస్తవాన్ని చెప్తూ.. వాళ్ళ అమ్మా,నాన్నా ఇంట్లో పోరు పెడుతూంటాడు. అయితే అర్జున్ కు వేరే ఆలోచనలు ఉన్నాయి. ఓ ఐదేళ్లు పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసి అప్పుడు  పెళ్లి చేసుకుందామనుకుంటాడు. ఈలోగా వాళ్ల అమ్మ.. బలవతంగా ఓ పెళ్లిచూపులు ఎరేంజ్ చేసేస్తుంది.  ఆ అమ్మాయి పేరు అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌). అంజలి రాగానే మొదటి మాటలోనే తను ఓ ఐదేళ్ల పాటు పెళ్లి ఆలోచనలు చేయదలుచుకోలేదని చెప్పేస్తాడు. దాంతో ఆమె  చిరాకు పడుతుంది.

అదేదో పెళ్లి చూపులకు రాక ముందే చెప్తే .. తనకు ఈ ఇబ్బంది తప్పేది కదా అంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పెళ్లి చూపులు విషయం తన తల్లికి చెప్పాలి. తన తల్లికి ఆరోగ్యపరంగా ఓ సమస్య ఉంటుంది. ఎక్కువ సంతోషాన్ని, బాధని తట్టుకోలేదు. గతంలోనూ జరిగిన పెళ్లి చూపుల్లో తన తల్లి అనారోగ్యం ఎత్తి చూపి రిజెక్ట్ చేసి ఉంటారు. దాంతో ఆమెకు పెళ్లి చూపులు అంటే భయం. ఇప్పుడు అర్జున్.. అసలు పెళ్లి చూపులు మొదలు కాకుండానే బాంబు వేసేశాడు.

ఏం చెప్పాలి … అమ్మకు.. ఎలా చెప్పాలి… ఆమె ఎలా దీన్ని తీసుకుంటుంది.. ఇలా ఆలోచలో పడిపోయింది అంజలి. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ … ఏం చేశాడు… నాకేం సంబంధం.. నీ చావు నువ్వు చావు అంటూ ఆమెను సాగనంపాడా…లేక ఆమెతో జీవిత కాలం జర్నీ చేయటానికి మొదటి అడుగు వేశాడా…అసలు ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది?

24 గంటల్లో ..ఇద్దరి జీవితాల్లో జరిగిన విషయాలను కూర్చుతూ, బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాయటం అంటే మామూలు విషయం కాదు..ఆ విషయంలో డైరక్టర్ కమ్ స్క్రిప్టు రైటర్ అయిన రాహుల్ రవీంద్రన్ వందకు వందశాతం సక్సెస్ సాధించినట్లే.  సినిమా ప్రారంభం కొద్దిగా క్యారక్టర్స్ ఇంట్రడక్షన్ సాగతీసినట్లు అనిపించినా..తర్వాత..తర్వాత చక్కటి కథనం, డైలాగులతో దూసుకుపోయింది.  ముఖ్యంగా హీరోయిన్  క్యారక్టరైజేషన్ ఎక్కడా డౌన్ కాదు…అదే సినిమాని చివరి వరకూ లాక్కెళ్లితుంది. శేఖర్ కమ్ముల  ఆనంద్, గోదావరిలో హీరోయిన్ పాత్రలు గుర్తుకు వస్తాయి. అంత స్ట్రాంగ్ గా ఉంది.

ప్రేరణ పొందారా?

ఈ సినిమా చూస్తూంటే… Only Human (2004) అనే స్పానిష్ చాలా చోట్ల  సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాని నిజంగా తీసుకుని ఎడాప్ట్ చేసి ఉంటే మాత్రం… రాహుల్ రవీంద్రన్‌ని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే అంత బాగా ఎడాప్ట్ చేశాడు మరి.

ఎవరెలా చేశారంటే…

ఈ సినిమాలో హీరో సుశాంత్ కు కెరీర్ ప్రారంభం నుంచి చెప్పుకోవటానికి ఒక్క హిట్టూ లేదు. అలాగే గుర్తుంచుకోదగ్గ సినిమానూ చెయ్యలేదు. కానీ ఈ సినిమాలో అద్బుతం అనలేం కానీ తన బాడీ లాంగ్వేజీ కు తగిన పాత్ర వచ్చింది, రియాల్టికు దగ్గరగా చేసాడనే చెప్పాలి. ఇక నుంచైనా ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే సుశాంత్ తిరిగి కుర్ర హీరోల రేస్ లోకి వస్తాడు. కొత్త  హీరోయిన్ సైతం చక్కగా చేసింది. ఆమె నవ్వే చాలా చోట్ల స్క్రీన్ కు గ్లామర్ తీసుకువచ్చింది. నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంది.  వెన్నెల కిషోర్ కామెడీ ..ఈ రొమాంటిక్ కామెడీలో మంచి రిలీఫ్. ఇందులో మరో విశేషం..ఈ సినిమాలో  ఎవ్వ‌రూ మేక‌ప్‌తో క‌నిపించ‌లేదు.

rahul-ravindranహీరో నుంచి దర్శకుడుగా…

హీరో నుంచి దర్శకుడుగా మారిన రాహుల్ రవీంద్రన్.. తొలి ప్రయత్నం లో ఎక్కడా తడబాటు అన్నది లేదు. చక్కగా తను అనుకున్న విషయాన్ని తెరకెక్కించుకుంటూ వెళ్లారు. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టారు. అయితే సుమంత్ ని ని తెరపై చూస్తూంటే రాహుల్ రవీంద్రనే చూస్తున్నట్లు ఉంది. అదే బాడీ లాంగ్వేజ్ ఫాలో అయ్యిపోయారు.  నీటుగా , స్పీటుగా సినిమాలు ఇలాగే తీస్తూ  వెల్తే తెలుగుకు మరో మంచి దర్శకుడు దొరికినట్లే.

సాంకేతికంగా…

ఫస్టాఫ్ ..పాత్రల పరిచయం సీన్స్ ని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ మాత్రం చాలా టైట్ గా ఉంది.  ఉన్న కాస్తంత తక్కువ లొకేషన్స్ లోనే సినిమాటోగ్రఫి నీటుగా చేసారు. పాటలు ఎలా ఉన్నా..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ …మూడ్ ని సెట్ చేసింది.

హైలెట్స్…

పోలీస్ అధికారిగా రాహుల్‌ రామకృష్ణ చేసే    ‘పన్నెండు లక్షలు సెటిల్ మెంట్’ సీన్‌ బాగా పండింది.
హీరోయిన్ రుహాని శర్మ నటనే ఈ సినిమాకు ప్రాణం. ఉమెన్ ఆఫ్ ది సినిమా.. ఆమే.

నో లాజిక్స్.. ఓన్లీ…

అప్పటిదాకా పరిచయం లేని హీరో,హీరోయిన్స్ కేవలం నాలుగైదు గంటల్లో ఒకరికొకరు ఎలా నచ్చేసారు…పెళ్లి దాకా ఎలా వెళ్లిపోయారు, …వంటి ప్రశ్నలు వేసుకోకుండా..ప్రేమ పుట్టడానికి పది  క్షణాలు చాలు వంటి లాజిక్కులు దగ్గరపెట్టుకుంటే సినిమా ఇంకా బాగా నచ్చేస్తుంది. ఫ్యామిలీలకు మంచి వీకెండ్ కాలక్షేపమే.

ఫైనల్ థాట్…

సుశాంత్ ని హీరోగా నిలబెట్టడానికి హీరో రాహుల్ రవీంద్రన్ …డైరక్టర్ అవతారం ఎత్తారు. మరి రాహుల్ రవీంద్రన్ ని హీరోగా నిలబెట్టడానికి ఏ హీరో అయినా నడుం బిగిస్తారో లేక రాహుల్ .. ఇలా దర్శకుడుగా కంటిన్యూ అయిపోతారో చూడాలి.

రేటింగ్: 3

ఎవరెవరు…

తారాగ‌ణం: సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌ కిశోర్‌, అనుహాస‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి
క‌ళ‌: వినోద్ వ‌ర్మ‌
కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఎం.సుకుమార్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌
నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ కార్పొరేష‌న్‌

josyula surya prakash

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -