సెంటిమెంట్ రా.. బాబు!: ‘చినబాబు’ మూవీ రివ్యూ

chinababu-movie
- Advertisement -

chinababu-poster

రైతే రాజు, రైతే దేవుడు అని చెప్పే మనం రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసే కుర్రాడికి పిల్లను ఇవ్వటానికి ఆలోచిస్తాం. వ్యవసాయం అంటే కేవలం చదువు రాని, లేదా చదువుకోని వారు చేసే ఓ పనిగా భావిస్తాం. అలాంటి మైండ్ సెట్ తో  మనం రైతుని హీరోగా పెట్టి సినిమాలు ఏం తీస్తాం. అయితే ఒకప్పుడు ప్రతీ హీరో పల్లెటూరి కథలు చేసేవారు. ఆ రోజులు వెళ్లిపోయాయి. పల్లెటూరు కథ అంటే పాతకాలం కథ అన్న దృష్టికి వచ్చేశారు.

- Advertisement -

తమిళ హీరో కార్తీ ఈ విషయం గమనించాడేమో… ఓ రైతు యువకుడుగా చేస్తూ, సాధారణ గ్రామీణ రైతు కుటుంబాల్లో ఉండే బంధాలు, అనుబంధాలు, వారి మధ్య ఉండే భావోద్వేగాలను హైలెట్ చేస్తూ ‘చినబాబు’ సినిమా చేశారు. ఇంతకీ ‘చినబాబు’లో చూపెట్టింది ఏమిటి? కార్తీ ఈ కాలం రైతులా ఉన్నాడా లేక పాతకాలం సినిమా రైతులా ఉన్నాడా? అసలీ సినిమా చూసేలా ఉందా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే!

chinababu-poster1కథేంటి?

భూస్వామి రుద్ర‌రాజు (స‌త్య‌రాజు)కు వరసగా  ఐదుగురు ఆడపిల్లలు పుడతారు. మగపిల్లాడు ఉంటే తను చనిపోయినా పుట్టింటి తరపునుంచి జీవితాంతం వారికి తోడుగా ఉంటాడని భావించి ఎదురుచూస్తున్న సమయంలో పుట్టిన మ‌గ‌పిల్లాడు కృష్ణంరాజు (కార్తీ). టెన్త్ క్లాస్ వరకూ చదువుకుని వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూంటాడు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న అతనికి ఆ ఏరియాలో మంచి క్రేజ్ ఉంటుంది. మంచి సంపాదన కూడా ఉంటుంది. రైతుకు తిరిగి పూర్వ వైభవం రావాలని, గౌరవం పెరగాలని భావించి అందుకోసం పనిచేస్తూంటాడు.

మరో పక్క తన తండ్రి  కోరుకున్నట్లుగానే  అక్కలందరితో చాలా ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో  ఉంటూంటాడు.  పెళ్లి వయస్సు రావటంతో   అక్కలు తమ పిల్లలలో ఎవరో ఒకరిని చేసుకుంటాడని అంతా అనుకుంటూంటారు.  అయితే కృష్ణంరాజుకు .. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మోసిన మేనకోడళ్లపై అలాంటి ఆలోచనలు ఉండవు.  తనకు పరిచయమైన నీల‌నీర‌ద (సాయేషా)ను ప్రేమిస్తాడు.

దాంతో కుటుంబంలో పెద్ద గొడవలు చెలరేగుతాయి. అక్కలు, బావలు అంతా నిరసన ప్రకటిస్తారు. తల్లి, తండ్రికి తీరని మనస్థాపం ఏర్పడుతుంది.  ఈ నేపథ్యంలో కృష్ణంరాజు వారందరికీ సర్దిచెప్పి ఎలా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? ఈ క్రమంలో సురేంద‌ర్ రాజు (శ‌త్రు)తో జరిగిన గొడవేంటి? ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే స్థాయికి ఆ  గొడవ ఎలా పెరిగింది? ఇలాంటి విషయాలన్నీ వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు, ఉమ్మడి కుటుంబాల గాథలు, కుటుంబ అనుబంధాలు అల్లుకున్న సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా అరుదైపోయాయి. గ్రామాల్లో కథలు కరువయ్యాయో.. లేక అటువంటి సినిమాలు ఎవరు చూస్తారు అనుకుంటున్నారో కానీ..  ఎక్కువ శాతం అర్బనైజ్డ్ కథలే వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘రంగస్థలం’ మినహాయిస్తే మనకు పూర్తి గ్రామీణ కథ కనపడదు. అయితే ఆ తరహా సినిమాలను ఇషపడే వారికి ఇది ఫుల్ మీల్సే.

chinababu-familyఅరుదైన కుటుంబ చిత్రపటం…

మన కుటుంబాల్లో ఉండే అక్కాచెల్లెళ్లు, మేనమామ-మేనల్లుడు సరదాలు, అన్నదమ్ములు, బావ, బావమరిదిల మధ్య సరదాలను, అలకలు, గొడవలను ఈ చిత్రం చాలా సహజంగా, అందంగా చూపించింది. అయితే ఈ రోజుల్లో ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం దొరకటం కష్టం. చాలా అరుదైపోయిన కుటుంబ చిత్రపటం ఇది.

హైలెట్స్…

కార్తీ క్యారక్టరైజేషన్,  తమిళ కమెడియన్‌ సూరి కామెడీ, పంచ్‌లు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీక్వెన్స్ ,  వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ..  రియలిస్టిక్ గా విలేజ్ ఎట్మాస్మియర్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించింది.

ఏమేం బాగోలేదంటే…

సినిమాలో విలన్ పాత్ర. అది చాలా రొట్టకొట్టడుగా అనేక సినిమాల్లో చూసిందే. అలాగే తమిళ అతి అనండి లేదా వీర సెంటిమెంట్ అనండి కొన్ని చోట్ల బోర్డర్ దాటి బేర్ మనిపించింది. అయితే అది ఈ సినిమా చూడటానికి ఏ మాత్రం అడ్డంకి కాదు. ఎందుకంటే ఎక్కువసేపు ఆ మెలోడ్రామాని లాగకుండా కట్ చేసి దర్శకుడు తన విజ్ఞతను ప్రదర్శించాడు.

ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు..  లవ్ ట్రాక్‌ను ఎలివేట్ చేయకుండా తొక్కేశాడు.

కార్తీ ఉన్నాడు కాబట్టి ఇది తమిళ సినిమా అని కాకుండా… తమిళ వాసన ప్రతీ సీన్ లోనూ ప్రవహిస్తూ పరవశింప చేస్తూ.. మీరు చూస్తున్నది తమిళ సినిమానే అని పదే పదే గుర్తు చేయటం ఈ సినిమా ప్రత్యేకత.

బాహుబలిలో కట్టప్ప‌గా చేసి అదరకొట్టిన సత్యరాజ్‌కు ఈ సినిమాలో డబ్బింగ్ సరిగా చెప్పించక నీరు కార్చేశారు.

సాంకేతికంగా ఎలా ఉందంటే…

డి.ఇమాన్  పాటలు  మెల్లగా ఎక్కుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  రుబన్ ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఇంకొన్ని సీన్స్ లేపేసి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాతగా హీరో  సూర్య పాటించిన  ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

chinababu3ఇది చెబితే బాగుండేది…

అక్క కూతుర్ని  మేనమామ చేసుకోవటం మన దక్షిణాది కుటుంబాల్లో చాలా కాలంగా వస్తోంది.  అక్క కూతురు అయితే ఆస్తి బయటికి పోదు అనో, లేక తమ ఎదురుగా పెరిగిన పిల్ల తమ ఇంట్లో ఉంటుందనో భావిస్తూంటాం.  ఇలా ద‌గ్గ‌ర బంధువుల మ‌ధ్య జ‌రిగే  పెళ్లిళ్ల‌ను క‌న్‌సాన్‌జీనియ‌స్ మేరేజెస్ అంటారు. ఈ ర‌క‌మైన పెళ్లిళ్ళ వ‌ల్ల జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లతో అవయవ లోపాలతో పిల్లలు పుడుతూంటారు.  ఈ విషయం ఎక్కడో చోట హీరో చేత చెప్పిస్తే బాగుండేది. ఎందుకంటే సబ్జెక్ట్ అక్క కూతుళ్లను చేసుకోవటం మీదే కాబట్టి.

ఫైనల్ థాట్…

ఈ సినిమా రిలీజ్ రాంగ్ టైమ్ అనిపిస్తోంది. ఏ సంక్రాంతికో, దసరాకో వస్తే ఆ పండగ ఎట్మాస్ఫియర్ ..ఈ ప్యామిలీ ఎమోషన్స్ కల సినిమాని చక్కగా ప్రమోట్ చేసే అవకాశం ఉండేది. అప్పట్లో అయితే ఈ సినిమా రైట్స్ తీసుకుని వెంకటేష్ చేద్దురేమో అనిపించింది.

తారాగణం వీరే…

నటీనటులు: కార్తి, సాయేషా సైగల్‌, సత్యరాజ్‌, సూరి, ప్రియా భవానీ శంకర్‌, భానుప్రియ, విజి చంద్రశేఖర్‌ తదితరులు
సంగీతం: డి. ఇమాన్‌
సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌
ఎడిటింగ్‌: రుబెన్‌
నిర్మాత: సూర్య
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పాండిరాజ్‌
బ్యానర్‌: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 13-07-2018

surya-prakash

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -