కథ ఇలా ఉందేంటి బాస్? ‘దేవదాస్’ మూవీ రివ్యూ

2:15 pm, Fri, 28 September 18
devadas-movie-still

devadas-nagarjuna-nani

దేవ(నాగార్జున) ఓ పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా డాన్ (ఆ విషయం డైలాగుల్లో చెప్తూ పేపర్ కటింగ్‌లు చూపెడుతూంటారు.. విచిత్రం ఏమిటంటే.. ఆయన మాఫియా పనులు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా చేసినట్లు సినిమాలో కనపడదు.  సీక్రెట్ గా చేస్తారేమో మరి.. చివరికి భాయ్ (ఇదీ నాగ్ దే) సినిమాలో లాగ విదేశాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడు.  ఇక్కడే వినాయకుడు విగ్రహం దగ్గర ఎంట్రీ ఇచ్చి పాటలు గట్రా పాడుతూంటాడు.

పోనీ ఆ పాట అయ్యాక.. ఆ వినాయకుడి విగ్రహమైనా ఎత్తుపోతాడేమో అనుకుంటే అదేమో మట్టి విగ్రహం. సర్లే.. ఆయన మాఫియా పనులు ఏం చేస్తాడో కానీ, కొంతమంది బ్యాచ్… చేతిలో తుపాకులు పట్టుకుని తిరుగుతూంటారు. ఇదిలా ఉంటే… ఈ మాఫియా డాన్ దేవకు తండ్రిలాంటి వాడైన దాదా(శరత్‌కుమార్‌)ను ఓ ముఠా ఉత్తిపుణ్యాన చంపేస్తుంది.

దాంతో ఆ ముఠాని అంతమొందించటానికి  హైదరాబాద్‌ వస్తాడు‌ దేవ. (ఆయన నెట్ వర్క్ ఇక్కడ ఉండదేమో… లేక తన చేతులతో పగ తీర్చుకుందామనో కానీ ఇక్కడే స్వయంగా లాండ్ అవుతాడు).  దేవ వస్తున్న  విషయం పోలీసులకు తెలిసి..  పట్టుకోవడానికి పోలీసులు స్కెచ్ వేస్తారు. ఇన్ఫర్మేషన్ అందుకుని  దేవపై కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో బుల్లెట్ ఛాతీలో దిగితే   దేవ..‌ దాస్‌(నాని) అనే ఓ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు.

ఒక్కడంటే ఒక్క పేషెంట్ కూడా లేని, రాని క్లినిక్ నడిపే డాక్టర్ దాస్… దేవ ని రక్షించటమే కాకుండా పనీపాట లేకపోవటంతో..  ప్రెండ్షిప్ కూడా చేస్తాడు. రోజూ సాయింత్రం  ఇద్దరూ కలిసి మందు కొడుతూంటారు. తర్వాత చనువు ఎక్కువై.. ఒకరి లవ్ స్టోరీలు మరొకరికి చెప్పుకుని ఓదార్చుకుంటారు. ఆ తర్వాత ఒకరి లవ్ స్టోరీకి మరొకరు సాయపడదామని ఫిక్స్ అవుతారు. దేవ కూడా మాఫియా పనులు మానేసి ఈ డాక్టర్ చుట్టూ తిరుగుతూంటాడు.

ఇలా దేవ, దాసు కలిసి మందు, మంచు నీళ్లులా కలిసిపోయి కబుర్లు చెప్పుకుంటూంటే.. పోలీసులకు ఆ సమాచరం అందుతుంది. అప్పుడు వాళ్లేం చేశారు? దేవాను పట్టుకున్నారా?.. మరి దాస్‌ని  ఏం చేశారు? వారి ప్రేమ కథలు ఏమయ్యాయి?.. వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

సమస్య ఏది బాస్?

Analyze This (1999)అనే హాలీవుడ్ సినిమాని ఆ సినిమా ప్రేరణతో సినిమా చేసారని తెలియకుండా ఉండాలని ఎన్ని మార్పులు అయ్యితే చేయాలనుకున్నారో అన్నీ చేసేసారు. అయితే మూలం మాత్రం మార్చలేకపోయారు. దాంతో ఎత్తుగడ బాగున్నట్లు అనిపించినా.. ఈ కొత్తగా చేసిన మార్పులు ఈ కథలో ఇమడక…కక్కుకుంది.

ఒరిజనల్ సినిమాలో …ఓ మాఫియా డాన్ కు ట్రీట్ మెంట్ చేయటం వల్ల ఓ సైక్రాటిస్ట్ (డాక్టర్) ఏ సమస్యల్లో ఇరుక్కున్నాడు అనేది కథ. దాంతో కథలో కాంప్లిక్ట్ ఏర్పడింది. ఇక్కడ డాన్, డాక్టర్ కలిసిపోయి డ్యూయిట్స్ పాడుకోవటమే సరిపోయింది. కొంపదీసి కథలో వీళ్లద్దరూ ప్రేమలో పడిపోయి..ఈ మధ్యన సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరిస్తారేమో అనే డౌట్ కూడా వచ్చేస్తుంది.

అలాంటప్పుడు క్యారక్టర్స్ మధ్య సంఘర్షణ ఎక్కడుంటుంది. డాన్ రాకతో డాక్టర్ జీవితం సంక్షోభంలో పడితే అప్పుడు చూసేవారికి ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఆ విషయం మర్చిపోయారు..ఎక్కడో ప్రీ క్లైమాక్స్ దాకా డాక్టర్ కు ..డాన్ వల్ల సమస్యలు రావు. అప్పటికి కూడా ఈ డాన్ వచ్చి మన డాక్టర్ ని రక్షించేస్తాడు కదా అనే ధీమా మనను అది ఓ సమస్యగా చూడబుద్ది కాదు.

క్రేజీ కాంబో- లేజీ కథనం…

హీరో నాగార్జునను అంతమొందించాలని తిరిగే విలన్ కు పెద్ద కారణం ఏమీ ఉండదు. అలాగే ఎలాగైనా నాగ్ ని చంపాలన్న కోరిక అతని చేతల్లో కనపడదు. గుర్తు వచ్చినప్పుడే ఏసెయ్యాలని అంటూంటాడు. అలా వీన్ విలన్ ..సినిమాని వీక్ చేసేసింది. పోలీస్ లు కూడా నాగ్ ని ఎందుకు పట్టుకుని చంపాలనుకుంటారు..అతను ఏమన్నా దావూద్ ఇబ్రహీం నా, చోఠా షకీలా లేక మరొక దుర్మార్గుడా…అది క్లారిటీ ఉండదు.

నాగ్ ని నెగిటివ్ షేడ్స్ తో  చూపెడితే ఇబ్బంది అనుకుని … ఆ సీన్స్ ని ఎస్కేప్ అయ్యిపోయారు. దాంతో నాగ్ క్యారక్టరైజేషన్ పై క్లారిటీ లేకుండాపోయింది. ఎప్పుడైతే ప్రిన్సుపల్ క్యారక్టర్ పై చూసేవాడికి అవగాహన ఉండదో అప్పుడు ఆ పాత్ర ఎమోషన్స్ ని ఫాలో అటం కష్టం.

మధ్యలో సందేశాలు కూడా…

ఈ కమర్షియల్ కథకు మధ్యలో యాడ్స్ లాగ…అవయువ దానం, కాన్సర్  ఎంత ఇబ్బంది పెడుతుంది వంటి మెసేజ్ లు కలిపారు. వాట్సప్ లో మెసేజ్ లే చూడలేక ఛస్తుంటే సినిమా తెరపై కూడా డబ్బులు పెట్టి మరీ ఈ మెసేజ్ ల మసాజ్ చేయించుకోవాలంటే ఇబ్బందే.

ఎందుకు వెళ్తాం…

ఈ సినిమాని నాని, నాగార్జున ఇద్దరు కలిసి నవ్విస్తారు అని ఆశించి వెళ్తాం. ఇందులో జెన్యూన్ నవ్వులు చాలా తక్కువ ఉన్నాయి. తెరపై నాని,నాగ్ కలిసి నవ్వేసుకోవటమే సరిపోతుంది. మనం నవ్వుకునేటంత అవకాసం వాళ్లు ఇవ్వరు.

నానికి లవ్ స్టోరీ ఏంటి ఇలా ఉంది…

నాని లాంటి యంగ్ హీరోకు లవ్ స్టోరీ ఉండాలి కానీ…నాగార్జున కు లవ్ స్టోరీ ని పెట్టారు.అలాగే  నాని లవ్ స్టోరీ పేరుకే కానీ అసలు నాని, ఆ అమ్మాయి ప్రేమించునేటంత సీన్ సినిమాలో ఎక్కడా ఇవ్వలేదు. యంగ్ ప్రేక్షకులు నాని పాత్రలో తమను తాము చూసుకుంటారనే విషయం మర్చిపోయినట్లున్నారు.

డాక్టర్ ఓకే కానీ, డాన్…

ఈ సినిమాలో నాని, నాగార్జున ఇద్దరూ తమ తమ పాత్రలుకు అణుగుణంగా చేసుకుంటూ పోయారు. కానీ నాని అయినా డాక్టర్ గ అనిపిస్తాడేమో కానీ నాగార్జున మాత్రం డాన్ లా మాత్రం కనపడడు. టెక్నికల్ గా సినిమా గ్రాండియర్ గా ఉంది. పాటల్లో రెండు బాగున్నాయి. డైలాగులు జస్ట్ ఓకే. పెద్దగా పేలలేదు.

ఎడిటర్ గారు మాత్రం సెంకడాఫ్ మరింత ట్రిమ్ చేసి ఉంటే చూసేవాళ్ల టైమ్ అయినా కలిసి వచ్చేది.  దర్శకుడుగా శ్రీరామ్ ఆదిత్య…తన కథతో ..హీరోలను ఒప్పించగలుగుతున్నారు కానీ ప్రేక్షకులను ఒప్పించలేకపోతున్నారు. క్రేజీ కాంబినేషన్ కి  లేజీ కథ కలిస్తే…యావరేజ్ లు కూడా కష్టమే అని ఈ సినిమా మరో సారి పాఠం చెప్తుంది.

ఫైనల్ థాట్…

ఈ ‘దేవదాసు’ని చూశాక ఓ మూలకి పోయి శాలువ కప్పుకుని, మందు కొట్టాలనిపిస్తుంది.

తారాగణం…

నటీనటులు: నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్‌, రష్మిక, కునాల్‌ కపూర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: షమదత్‌ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి
నిర్మాత: అశ్వనీదత్‌
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
సంస్థ: వైజయంతీ మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ: 27-09-2018

josyula surya prakash

-సూర్యప్రకాష్ జోశ్యుల