‘కాలా’ మూవీ రివ్యూ : క్యారే ఓట్ల కోసం సెట్టింగా?

- Advertisement -

కాలా వచ్చాడు…

ముంబైలో ధారవి అనే మురికి వాడ నాయకుడు (కమల్ లాగ)  కరికాలన్‌.. అలియాస్ కాలా(రజనీకాంత్‌). ఆ మురికి వాడను ఆక్రమించుకుని అక్కడ అపార్ట్‌మెంట్లు కట్టి డబ్బు చేసుకోవాలనుకుంటాడు హరిదాదా(నానా పాటేకర్‌) అనే అంగబలం ,అర్దబలం ఉన్న పొలిటీషియన్. అందుకు  కాలా ఒప్పుకుంటాడా…అడ్డుతగులుతాడు. అడ్డు తగిలితే విలన్ అయిన హరి దాదా ఊరుకుంటాడా..అడ్డు తొలిగించుకోవటానికి ట్రై చేస్తాడు. ఆ క్రమంలో కాలా చాలా కోల్పోతాడు. కానీ ధారవిని వదులుకోడు. అదెలా అనేది తెరపై చూడాల్సిన కథనం.

- Advertisement -

క్యారే ఎలెక్షన్ కోసం సెట్టింగా?

నిజానికి పైన చెప్పుకునేది ఈ సినిమాకు పైకి కనపడే కథ. కానీ ఇందులో మనకు అంతర్గతంగా మరో విషయం రన్ అవుతూంటుంది. అది..రజనీ పొలిటికల్ లైఫ్ కోసం రెడీ చేసినట్లు ఇట్టే అర్దమవుతుంది. హరిదాదా పాత్ర..శ్రీరాముడుని పూజిస్తూ..రామాయణం వింటూ,ఆయన భక్తుడిగా చూపెడతాడు. అదే రజనీ పాత్రను ..ధారవి అనేది ఓ లంకలా…అక్కడ రజనీ..ఓ రావణుడులా మనకి ఆవిష్కరింపచేస్తాడు. మనకి అర్దం కాదేమోనని డైలాగుల్లో కూడా చెప్పిస్తాడు. రామ వెర్శస్ రావణ కథలా అంటే మనకు మణిరత్నం రావణ సినిమాలాగ రావణ పాత్రను(రజనీ పాత్రను) హైలెట్ చేస్తారన్నమాట.  అలాగే …మోదీ స్వచ్చ్ భారత్ కాన్సెప్టుకు ఇది కౌంటర్ లాగ కనిపిస్తుంది. విలన్ నానాపటేకర్ చేత…ప్యూర్ ఇండియా..స్వచ్చ్ ఇండియా..దేశం అంతా శుభ్రంగా ఉండాలి అనిపిస్తారు. శుబ్రత లేదనే కారణంతో పేదలను ప్రక్కనపెట్టేస్తున్నారని, మురకి వాడలను పట్టించుకోవటం లేదని చెప్తారు. అదంతా రజనీ పొలిటికల్ ఎజెండాలోని అంశాలులాగ అనిపిస్తుంది.

పాత పాయింటే…

విలన్ ..ఓ ప్రాంతంపై కన్నేసి దాన్ని ఆక్రమించాలనుకోవటం, హీరో దాన్ని అడ్డుకోవటం అనేది ఇరవై ఏళ్ల క్రితం సినిమావాళ్లు చెడుగుడు ఆడేసిన పాయింట్. ఈ మధ్య కాలంలో ఆ పాయింట్ ని ఎవరూ టచ్ చేయటం లేదనేమో రంజిత్ ఈ కథను ఎన్నుకున్నారు. మేకింగ్ పరంగా ఆయన మెరుపులు చూపించినా స్క్రీన్ ప్లే లో మాత్రం పరమ బోరింగ్ గా తయారు చేసారు. ముఖ్యంగా స్లో నేరేషన్, రజనీకు ఆయన గతంలో లవర్ తో వచ్చే సన్నివేశాలు విసుగుతెప్పిస్తాయి. ఫస్టాఫ్ ఎలాగో వెళ్లిపోయింది,సెకండాఫ్ లేస్తుంది అనుకుంటే అదీ విసిగించేసింది. హీరో డౌన్ ఫాల్ అవుతూ..అవుతూ ఉంటాడు కానీ ఎక్కడా రైజ్ అయ్యే విధానం కనపడదు. దాంతో ఇంట్రస్ట్ చచ్చిపోతుంది.

ఎటో అటు వెళ్తే బాగుండేది…

ఇక దర్శకుడు పా. రంజిత్ విషయానికి వస్తే… సినిమాని ఓ డాక్యుమెంటరీ నేరేషన్ లో తీసాడు. అయితే అదీ పూర్తి గా చేయలేదు.  రియలిస్టిక్ ధోరణిలో కథ నడుపుతూ ఉన్నట్లుండి  సూపర్ స్టార్ కదా అని ఫైట్స్ అవీ మరీ   సినిమాటెక్ సన్నివేశాల్లోకి వెళ్లటం..మళ్లీ  వెనువెంటనే  రియలిస్టిక్ సీన్స్ వేయటం చేసి..సినిమాని అటూ..ఇటూ కాకుండా నడిపారు. అదే కాస్త ఇబ్బంది పెట్టింది.

బాగున్నవి ఏంటంటే..

ఈ సినిమాలో రజనీకన్నా ఎక్కువ మార్కులు నానా పటేకర్ కు పడతాయి.  కంటిచూపులతోనే క్రూరత్వాన్ని, కపటత్వాన్ని చూపారు నానా ప‌టేక‌ర్‌. రజనీ తన వయస్సుకి తగ్గట్లుగా కొడుకులు, కోడళ్లు ,మనవలు ఉన్న పాత్రను ఎంచుకోవటం ఆయనలోని పరిణితిని సూచిస్తుంది.

ధారావి  మురికివాడను సెట్‌గా రూపొందించిన ఆర్ట్ డైరక్టర్ అద్బుతం చేసారనే చెప్పాలి. ఎక్కడా సెట్ అనే ఆలోచనే కలగదు. అలాగే సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే పాటలు మాత్రం అసలు బాగోలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ లో ఫస్టాఫ్ ని మరింత స్పీడు చేసి ఉండే బాగుండేది.  అలాగే ప్లై ఓవర్ వద్ద రైన్ ఫైట్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్,  మినిస్టర్ (షాయీజి షిండే ) తో రజనీ  సీన్ వంటివి హైలెట్స్ గా నిలుస్తాయి. రజనీ భార్యగా ఈశ్వరీరావు బాగా చేసారు.

చాలాసార్లు ‘సర్కార్ ‘ను గుర్తు చేసే ఈ సినిమా  ‘కబాలి’ కన్నా బాగుంది.  అలాగే రజని మార్క్ కన్నా రంజిత్ మార్క్ ని ఎక్సపెక్ట్ చేసి సినిమాకి వెళితే పెద్దగా బాధ అనిపించదు.

ఫైనల్ థాట్…

ప్రేక్షకులను ఒప్పించటం కన్నా రజనీకాంత్ నే ఒప్పించటం సులభం అని రంజిత్ కు అర్దమై ఉంటుంది.

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: ధ‌నుశ్‌
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -