‘మహానటి’ మూవీ రివ్యూ

- Advertisement -

నటులు ఎందరో ఉంటారు. కానీ మహానటులు ఒక్కరే ఉంటారు. ఆ ఒకే ఒక్క మహానటి సావిత్రి.  ఆమె జీవించింది నలభై ఏడేళ్లే, అయితేనేం చిరస్దాయిగా నిలిచే నటనా కీర్తి సంపాదించింది. అంతెందుకు..  ఆమె సెట్‌లో ఉందంటే.. ఎస్ వి రంగారావు లాంటి నటుడు కూడా నటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మనస్సులో అనుకునేవాడట. సావిత్రి అంటే సాటి నటీమణులకు ఎంతో గౌరవం,  అభిమానం.  ఆమెను తలుచుకుంటే చాలు.. నటన అదే వస్తుంది. సావిత్రి తెలుగమ్మాయి అంటే తమిళులు నమ్మరు. ఒక్క తమిళలే కాదు, ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాషను అంత స్పష్టంగా , అదే తన  మాతృభాషలాగా మాట్లాడగలిగిన నేర్పరి.

అలాంటి మహానటి జీవితంలో ఎన్నో అధ్యాయాలు, మలుపులు ఉన్నాయి.  వాటి గురించి బయట జనాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.   వాటిల్లో ఏవి నిజం, ఏవి అబద్దం అనేవి తేల్చుకుంటే కానీ  బయోపిక్‌ని తీయలేం. కేవలం ఒక సినిమా అనుభవమే మాత్రం కలిగి ఉన్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు ఏ మేరకు న్యాయం చేయగలరు అనేది ఆసక్తికరమే.  ముఖ్యంగా సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించిన కీర్తిసురేష్‌..ఆ మహానటిని  ఏ మేరకు అనుకరించగలిగింది.. ఆ పాత్రలో ఏ స్థాయిలో జీవించగలిగింది? తెలుగు సినీ రంగంలోని అతిరథ  మహారథులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి? ఆ విషయాలన్ని తెలియాలంటే ‘మహానటి’ రివ్యూ చదవాల్సిందే.

ఎవడే  శంకరయ్య (స్టోరీ లైన్)

బెంగళూరులోని చాళుక్య హోటల్‌లో తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి (కీర్తి సురేష్‌) అప్పటి మీడియా సంచలనం. ఆమె గురించి తెలుసుకోవాలని, కొత్త విషయాలు ప్రపంచానికి  చెప్పాలని మీడియా అంతా ఉవ్విళ్లూరుతుంది. అయితే సావిత్రి గురించి కొత్తగా మాట్లాడటానికి ఏముంది..ఎప్పటికప్పుడు న్యూస్ లుగా వస్తూనే ఉన్నాయి అని మీడియావాళ్లు బిక్కమొహం  పెట్టుకుంటారు. అప్పుడు  ప్రజావాణి పత్రికలో విలేకరిగా చేరిన వాణి(సమంత)కు ఆమెపై స్పెషల్ స్టోరీ రాసే బాధ్యతను అప్పగిస్తారు. ఆమెకు తోడుగా ఆమెను ప్రేమిస్తున్న ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌  ఆంటోనీ(విజయ్‌ దేవరకొండ)కూడా బయిలుదేరతాడు. ఆ క్రమంలో వాళ్లకు సావిత్రి చివర రాసిన ఉత్తరంలోని  శంకరయ్య అనే క్యారక్టర్ మిస్టరీ గా కనిపిస్తుంది.అక్కడ నుంచి అసలు సావిత్రి జీవితం  ఏమిటి.ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి..వాటికి శంకరయ్య అనే పాత్రకు ఉన్న రిలేషన్ ఏమిటి అనే డైరక్షన్ లో ఎంక్వైరీ చేస్తూంటారు. చివరకు సావిత్రి జీవితంలో ఉన్న ఆ  శంకరయ్య ఎవరు..సావిత్రికు, జెమినీ గణేషన్ కు ఆమెకు మధ్య అనుబంధం ఎలా మొదలై, అది ప్రేమ,పెళ్లికి దారి తీసింది,ఎంతో ఎత్తుకు ఎదిగిన సావిత్రి జీవితం విషాదంగా ముగియటానికి కారణం  ఏమటి  వంటి అనేక విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

మహా విషాద ఆవిష్కరణ

దేవదాసులో పార్వతిగా అజరామరంగా కనిపించిన సావిత్రి నిజ జీవిత ప్రేమ కథ ఏమిటి, ఆమెను జెమినీ గణేష్  మోసం చేసారా,  ఆమె చివరి రోజుల విషాదం వెనక ఉన్న అసలు విషయం ఏమిటి  వంటి విషయాలే ఈ సినిమాకు యుఎస్ పి.  వాటిని మాత్రమే ఈ దర్శకుడు పరిగణనలోకి తీసుకున్నాడు.  అంతేకానీ ఆమె సినిమా జీవితం జోలికి పెద్దగా  వెళ్లలేదు. ఆమె షూటింగ్ లలో ఎలా  ఉండేది..అప్పటి షూటింగ్ లలో జరిగిన విశేషాలు వంటివి అక్కడక్కడా టచ్ చేసి వదిలేసారు.  అది ఆమె సినిమా జీవితంలో విశేషాలు ఆశించేవాళ్లకు కాస్తంత ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ…అవి కూడా పెడితే రెండు  పార్ట్ లు తీయాల్సి వచ్చేదన్నది నిజం.

ఆ విషయం ప్రక్కన పెడితే సావిత్రి జీవితంలో సినిమాల పరంగా ప్రక్కన పెడితే…ఆమె లైఫ్ లో ఎక్కువ భాగం ఉన్నవాడు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు, మోసగాడు అని చివరకు  గెంటివేయబడ్డవాడు అయిన జెమినీ గణేషణ్‌ (దుల్కర్‌  సల్మాన్‌). ప్రారంభంలో  సావిత్రి అందం చూసి ఎప్పటికైన పెద్ద నటి అవుతుందని చెప్పి ఆ ఫోటోలు తీసి పత్రికల వారికి ఇవ్వటంతో మొదలైన  అతని జైత్ర యాత్ర..చివరకు అతని స్త్రీ లోలత్వం బయిటపడి..సావిత్రి జీవితంలోనుంచి గెంటివేయబడటంతో ముగుస్తుంది. (అతను అసలు స్వరూపం బయిట  పడే సీన్స్ టెర్రిఫిక్ గా తీసాడు  దర్శకుడు).

తెలుగు ‘సిటిజన్ కేన్’

అయితే ఇదే కథను ఉన్నదున్నట్లు చెప్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. మహా అయితే ఓ మోసపోయిన ఓ అతివ కథ అవుతుంది. కానీ దర్శకుడు తెలివిగా Citizen Kane  (1941) లోని స్క్రీన్ ప్లే ని తీసుకున్నారు.  సిటిజన్ కేన్ సినిమా కథ ప్రకారం చార్లెస్ ఫోస్టర్ కేన్ అనే వ్యాపార వేత్త తను జీవితపు ఆఖరి క్షణాల్లో ‘రోజ్ బడ్’ అంటూ కన్నుమూస్తాడు. ఆయన  అలా ‘రోజ్ బడ్’ …అనటం నుంచి కథ వెనక్కి ఇన్విస్టిగేషన్ రూపంలో వెళ్తుంది.. కేన్ నోటి నుంచి వెలువడ్డ చివరి మాట రోజ్ బడ్ అనే దానికి అర్థం కనుగొనటానికి జెర్రీ థాంప్సన్ అనే పాత్రికేయుడు  చేసిన ప్రయత్నమే మిగిలిన సినిమా కథంతా.

తన ప్రయత్నంలో భాగంగా కేన్‌తో బాగా పరిచయమున్న స్నేహితులను, బంధువులను కలిసి వారి ద్వారా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటాడు . థాంప్సన్.  అదే స్కీన్ ప్లేను ఫాలో అవుతూ ఇక్కడ శంకరయ్య అనే మిస్టీరియస్  పాత్రను సావిత్రి జీవితంలో ఉన్నట్లు చూపి…ఆ శంకరయ్య ఎవరు అని వెనక్కి తవ్వుకుంటూ సమంత, విజయదేవరకొండ పాత్రలు   సావిత్రికు పరిచయమున్న వ్యక్తులను  కలుసుకుంటూ వెళ్లటంతో కథను నడిపించారు.

డైరక్టర్ ఎలా తీసాడు…

సావిత్రి వంటి అందరికీ తెలుసున్న, అందరికి అభిమానపాత్రురాలైన నటి జీవిత చరిత్ర తెరకెక్కించంట అనేది నిజంగా సాహసమే. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ఎటెమ్ట్ చేసినందుకు తిట్టిపోస్తారు.  అయితే ఆ సాహసాన్ని అందంగా, అంతకు మించి  అద్బుతంగా  ముగించినందుకు ముందుగా దర్శకుడు నాగ అశ్విన్ అభినందనీయుడు.  సినిమా కథను సావిత్రి చిన్నప్పుడు అంటే ఆరేళ్ల  వయస్సున్నప్పుడు  ఆమె తండ్రి చనిపోవటంతో  పెదనాన్న కే వెంకట రామయ్య చౌదరి(రాజేంద్ర ప్రసాద్‌) సంరక్షణలోకి రావటంతో మొదలెట్టి..ఓ పిల్లకాలువ మహా సముద్రమైనట్లు ఆమె  జీవితంలో ప్రొఫెషినల్, పర్శనల్  లైఫ్ లను చూపిస్తూ అర్దాంతరంగా మనల్ని వదిలివెళ్లిపోయిన ఓ మహా విషాదాన్ని ఆవిష్కరించాడు. ఈ బయోపిక్ ఇంకెవరూ ఇంతకన్నా బాగా తియ్యలేరేమో అనిపించకమానదు.

అన్నగారు ఏరి?

ఇక ఈ సినిమాలో నందమూరి తారకరామారావు , జమున వంటి వారి పాత్రలు కనపడవు. మొక్కుబడిగా అన్నగారి పై ఓ షాట్ పెట్టి ఊరుకున్నారు. కానీ నిజానికి సావిత్రి సిని జీవితంలో ఎన్టీఆర్ తో  చేసిన సినిమాలు ఎక్కువే. దాంతో ఎన్టీఆర్ పాత్ర లేకపోవటం చాలా వెలితిగా కనపించింది.  అలాగే ఆమె అంత ఇబ్బందిల్లో ఉన్నప్పుడు అన్నగారు కానీ, మిగతా నటీనటులు కానీ  ఏమీ స్పందించలేదా..అసలు అప్పటి ఆమె తోటి  నటీనటులు,ఆమెతో పని చేసిన దర్శక,నిర్మాతలు  ఎలా స్పందించారన్నది మాట వరసకు కూడా ప్రస్తావించలేదు. ఇక జమున,భానుమతి వంటి ఆ కాలంలో సావిత్రితో కలిసి ప్రయాణించిన చాలా  పాత్రలు  అసలు సినిమాలో లేనే లేవు.

కీర్తి పతాకం…

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఆమెకు ఖచ్చితంగా అవార్డ్ లు తెచ్చి పెట్టే రీతిలో చేసింది. అందులో వన్ పర్శంట్ కూడా సందేహం లేదు. అయితే సావిత్రి సినిమాలు ఎన్నో చూసి, ఆమె  హావభావాలు, మొహం కళవికలు స్పష్టంగా తమ మనస్సులో ముద్రవేసుకున్న అభిమానులకు  కీర్తి సురేష్ ఆనదు కాక ఆనదు. అయితే అది ఆమె తప్పు కాదు. అది కేవలం సావిత్రిలా వేరే  ఎవరినీ ఊహించుకోలేకపోవటమే. కాకపోతే ఈ సినిమాతో కీర్తి సురేష్..సంపూర్ణ నటిగా (మహానటిగా కాదు) ఆవిష్కారం అయ్యింది. ఇక నుంచైనా ఆమెకు నటనకు అవకాసం ఉన్న పాత్రలు పలకరిస్తాయేమో.

దుల్కర్ దుమ్ము దులిపాడు…

ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ దుల్కర్ సల్మాన్. జెమినీ గణేష్ నిజంగానే ఇలాగే ఉండేవాడేమో అన్నంతగా పాత్రలో ఒదిగిపోయి ఎమోషన్స్ పండించాడు.

మోహన్ బాబు, క్రిష్…

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, క్రిష్ (కె.విరెడ్డి)గా ఫెరఫెక్ట్ ఆప్షన్. చక్రపాణిగారు .. సన్నగా పొడుగ్గా ఉండే రూపం..ఆ పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ గారిలో కనపడలేదు. సన్నగా ఉంటాడని తీసుకున్నారేమో ఎల్  వి ప్రసాద్ గా.. అవసరాల శ్రీనివాస్  ..జస్ట్ ఓకే అనిపించారు. ఇంకొందరు డైరక్టర్స్ కనిపించారు.  కాని గుర్తు పట్టేటంత అవకాశం ఇవ్వనంత తక్కువ సమయం మాత్రమే వారికి కేటాయించారు.  అక్కినేని పాత్రలో నాగ చైతన్య చక్కగా చేశాడు.

సమంత, విజయ్ దేవరకొండ ఎలా చేసారంటే..

సినిమాలో సావిత్రి కథతో పాటు సమాంతరంగా సాగే సమంత, విజయదేవరకొండ పాత్రలు డిజైన్ చేయటం బాగున్నాయి. అయితే అదే సమంయలో వాళ్లు లవ్ స్టోరీ ఇంకొంచెం డెప్త్ గా..సావిత్రి లవ్  స్టోరీకు సిమిలర్ గా ఉండి..ఆమె కథనుంచి ప్రేరణ పొంది వీళ్ల ప్రేమ జీవితం సరిచేసుకున్నట్లు పెడితే కథలో కలిసిపోయేది. వేరే ట్రాక్ గా కనపడేది కాదు.

ఆ కాలంలోకి తీసుకు వెళ్లిన..

ఈ సినిమాకోసం పూర్తి స్దాయి రీసెర్చ్ చేసిన  దర్శకుడు నాగ్ అశ్విన్ కే పూర్తి క్రెడిట్ దక్కుతుంది. మరీ ముఖ్యంగా సావిత్రి  పతనాన్ని చూపిన విధానం, ఆమె మద్యానికి బానిస అయ్యిన విధానం  ఎక్కడా ఆమె పై నెగిటివ్ నెస్ రాకుండా డిజైన్ చేసారు. సినిమాకు ఎంచుకున్న షాట్స్, 80ల్లోకి మనలన్ని తీసుకెళ్లిన విధానం  దర్శకుడు నాగఅశ్విన్ ఈ తరం దర్శకుల్లో టాప్ ప్లేస్ లో  ఉన్నారనిపించింది.

మిక్కీ జె మేయర్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది కానీ పాటలు అంతగా అనిపించలేదు. మెల్లిమెల్లిగా ఎక్కుతాయేమో. కెమరామెన్ డాని  సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేసారు. ఇక  ప్రోడక్షన్ చాలా  బాగుంది. ఆర్టి డిపార్టమెంట్ దే పని అంతా.  ఎడిటింగ్ కూడా ఎక్కడా బోర్ రాకుండా తీసుకెల్లిపోయింది. డైలాగులే ఈ సినిమాకు చాలా చోట్ల ప్రాణంలా నిలిచాయి.

“అతనెవరో యంగ్ కుర్రాడు వచ్చాడంట ఆయన పేరేంటి… ఆ…కృష్ణ”
ఈ డైలాగు మాత్రం కేక 

“ఆడవాళ్ళ కన్నీళ్లు అందరికీ తెలుస్తాయ్ కానీ మగవాడి కన్నీళ్లు మందు బాటిల్ కి మాత్రమే తెలుస్తుంది”.. అంటూ దుల్కర్  (జెమినీ గణేష్ ) చెప్పే  డైలాగు కూడా సూపర్బ్ గా అనిపిస్తుంది

బొర్రా సాయి మాధవ్ ఇలాంటి సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోతున్నారు.. సూపర్బ్ సార్!

మనస్సులో మాట…

అయితే సినిమా చూసాక ఒకటే అనిపిస్తుంది..సావిత్రి..తను ప్రేమించిన జెమినీ గణేషన్ పెళ్లి చేసుకునేటప్పటికి ఆల్రెడీ అలివేలు, పుష్పవల్లి అని ఇద్దరు ఆయన జీవితంలో ఉంటారు. రెండో భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది.అయితే అప్పుడు ఆ మొదటి బార్య మానసిక పరిస్దితి ఏమిటి..

ఆ తర్వాత కాలంలో సావిత్రి తన భర్త మరొక ఆమెతో పట్టుబడిపడినప్పుడు మానసికంగా కుంగిపోతుంది. అంటే అప్పుడు జెమిని గణేషన్ మొదటి బార్య అనుభవించిన మానసిక వేదనే కదా మళ్లీ సావిత్రికి వెనక్కి తిరిగి వచ్చింది అనిపిస్తుంది. జీవితం బూమరాంగ్.నువ్వేది విసిరితే అదే తిరిగి వెనక్కి వస్తుంది.

అనిపించింది…

సాధారణ స్దాయి వ్యక్తిగా జీవితం మొదలై మహాదర్శకుడుగా, కొన్ని సంస్దల అధిపతిగా ఎదిగి సినిమాకే జీవితం అంకితం చేసిన  ఎల్ వి ప్రసాద్ గారి జీవిత చరిత్రను వారి కుమారులు చేస్తే బాగుండును అని ఈ బయోపిక్ చూసాక అనిపించింది.

అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ని ధైర్యంగా ఈ దర్శకుడు చేతికి అప్పగించవచ్చు.

సినిమా చూడచ్చా?

మీరింకా వెళ్లలేదా … బయిలుదేరండి మరి!

ఫైనల్ ధాట్…

తెరపై మహానటిగా వెలిగిన సావిత్రి నిజ జీవితంలో మాత్రం సాధారణ గృహిణిగా కూడా నటించలేకపోయింది.. అదే ఆమె బిగ్గెస్ట్ ఫెయిల్యూర్.

న‌టీన‌టులు: కీర్తి సురేశ్‌, మోహ‌న్‌బాబు, నాగ‌చైత‌న్య‌, ప్రకాశ్‌రాజ్‌, క్రిష్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, దుల్కర్ స‌ల్మాన్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, భానుప్రియ‌, మాళ‌వికానాయ‌ర్‌, షాలిని పాండే, తుల‌సి, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: డానీ షాంజెక్ లోఫెజ్
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర రావు
క‌ళ‌: అవినాశ్‌
నిర్మాత‌: ప్రియాంక ద‌త్‌
ద‌ర్శక‌త్వం: నాగ్ అశ్విన్

నిర్మాణ సంస్థలు: వైజ‌యంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌

– సూర్య ప్రకాష్ జోశ్యుల

 

 

- Advertisement -