#MeToo: 80 మందిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో దోషి…

8:07 pm, Tue, 25 February 20
harvey-weinstein

వాషింగ్టన్: లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న హాలీవుడ్ మూవీ మొఘల్, దర్శక నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్‌(67)కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. రెండు కేసుల్లో న్యూయార్క్ కోర్టు సోమవారం ఉదయం ఆయన్ని దోషిగా తేల్చడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది.  

అయితే వెయిన్‌స్టెయిన్‌పై ఉన్న ఫస్ట్ డిగ్రీ రేప్ లాంటి తీవ్ర నేరాలు రుజువుకాలేదు. 17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో ఫస్ట్ డిగ్రీ రేప్‌గా వ్యవహరిస్తారు. అంటే ఈ నేరాల్లో బాధితులు ‘అంగీకారం’ తెలుపగలిగే వయసులో ఉండరు.

ఇక 2006లో తనపై లైంగిక దాడి చేశారంటూ మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేయి నమోదు చేసిన కేసులోను, అలాగే 2013లో తనను రేప్ చేశారంటూ జెస్పికా మాన్ దాఖలు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు తీవ్రంగా స్పందించింది.

ఈ రెండు కేసుల్లో పలు దఫాలు విచారించిన న్యూయార్క్ కోర్టు 5 రోజులపాటు చర్చల తరువాత హార్వే వెయిన్‌స్టెయిన్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసుల్లో తీర్పును వాయిదా వేసినప్పటికీ, కేసుల తీవ్రతను బట్టి వెయిన్‌స్టెయిన్‌కు సుమారు 25 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇది #MeToo ఉద్యమ విజయమని బాధిత మహిళలు భావిస్తున్నారు.

angelina-jolie-gwyneth-paltrow-uma-thurman-salma-hayek-వారి ఆరోపణలతో మొదలైన #MeToo ఉద్యమం…

వెయిన్‌స్టెయిన్ కొన్నేళ్ల క్రితం తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దాదాపు 80 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వీరిలో హాలీవుడ్ ప్రముఖ నటీమణులు ఏంజెలీనా జోలీ, గ్వినెత్ పాల్‌త్రో, ఉమా తుర్మన్, సల్మా హయెక్ కూడా ఉన్నారు.  తాము హాలీవుడ్‌లో ప్రవేశించిన తొలి రోజుల్లో ఆయన తమను ఈ విధంగా వేధించినట్లు వారు వెల్లడించారు. 

ఈ ఆరోపణలే ఆ తరువాతి కాలంలో #MeToo ఉద్యమానికి ఊపిరిపోశాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో మరెంతోమంది మహిళలు తమపై జరిగిన అనుచిత, అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపుల వివరాలను ధైర్యంగా బయటపెడుతూ వచ్చారు. 

అసలేం జరిగిందంటే…

అక్టోబర్ 2017లో హాలీవుడ్ దర్శక నిర్మాత వెయిన్‌స్టెయిన్ లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ తొలిసారిగా గతంలో చోటుచేసుకున్న ఆ ఘటనల గురించి, బాధితుల గురించి ప్రచురించింది.

అయితే ఈ ఆరోపణలను ఆయన అప్పట్లోనే ఖండించారు. తన ప్రవర్తన కారణంగా ఏ మహిళకైనా బాధ కలిగి ఉంటే తాను క్షమాపణ కోరుతున్నానంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే అది అక్కడితో ఆగలేదు. ఆ తరువాత కూడా బాధిత మహిళలు పలువురు ఆయనపై ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీ బోర్డు నుంచి వెయిన్‌స్టెయిన్ తొలగించారు.

some-of-the-victims-of-harvey-weinsteinన్యూయార్క్ కోర్టులో ఏం జరిగిందంటే…

2017లో వెయిన్‌స్టెయిన్‌పై  నేర విచారణ మొదలైంది కానీ, మే 2018 వరకూ ఆయనపై అభియోగాలు నమోదు కాలేదు. ఆ తరువాత తన మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హలేయీపై 2006లో లైంగిక వేధింపులకు పాల్పడడం, మాజీ నటి జెస్సికా మాన్‌పై 2013లో అత్యాచారం జరిపిన కేసుల్లో ఆయనపై విచారణ మొదలైంది. 

తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టెయిన్‌ ఎంతోమంది నటీమణులను ఇతర మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించగా.. ఆయనపై ఆరోపణలు చేసిన వారితో వారి అంగీకారంతోనే ఆయన శృంగారంలో పాల్గొన్నారంటూ  డిఫెన్స్ లాయర్ వాదించారు.

అంతేకాదు, ఈ ‘సంబంధాన్ని’ వారు ఆ తరువాత తమ కెరీర్లో ఎదగడానికి కూడా వాడుకున్నారని డిఫెన్స్ లాయర్ పేర్కొన్నారు. కావాలనే ఇన్నేళ్ల తరువాత తన క్లయింట్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.

విచిత్రం ఏమింటే.. తమను ఫలానా తేదీన వెయిన్‌స్టెయిన్ లైంగికంగా వేధించారని, ఫలానా తేదీన తమపై అత్యాచారానికి పాల్పడ్డారని వారు ఆరోపణలు చేసినప్పటికీ.. ఆయా తేదీల తర్వాత కూడా సదరు మహిళలు ఆయనతో ఆ రకమైన సంబంధాలు కొనసాగించారని.. కోర్టు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని కూడా వాదించారు.

harvey-weinstein-after-convictionరెండు కేసుల్లో వాదోపవాదాల అనంతరం.. ఐదురోజుల వరుస చర్చల తర్వాత సోమవారం ఉదయం ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ కోర్టు జ్యూరీ హాలీవుడ్ దర్శక నిర్మాత వెయిన్‌స్టెయిన్‌ను దోషిగా తేల్చింది.  అతడికి శిక్షను మార్చి 11వ తేదీన ప్రకటిస్తామని, అప్పటివరకు ఆయన్ని జైలుకు తరలించాలని ఆదేశించింది. 

మరోవైపు వెయిన్‌స్టెయిన్‌‌పై నమోదై ఉన్న మరో రెండు కేసుల్లో మాత్రం జ్యూరీ ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఒకవేళ ఈ కేసుల్లో కూడా నేరాలు రుజువయి ఉంటే ఆయనకు జీవిత ఖైదు పడి ఉండేది. 

తీర్పు అనంతరం వెయిన్‌స్టెయిన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్‌తో మాట్లాడుతూ కనిపించారు. ఈ తీర్పుపై తాము పైకోర్టుకు అప్పీలు చేస్తామని ఆయన తరుపున వాదించిన లాయర్ డోనా రోటునో తెలిపారు. 

చదవండి: డర్టీ టూర్: 3 రాత్రులు, 4 పగళ్లు.. డ్రగ్స్, విచ్చలవిడి సెక్స్! ఎక్కడో తెలుసా?