ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా! హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స…

Actress and MP Sumalatha tested Corona Positive
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఎంపీ సుమలత కుడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. శనివారం ఆమె మాండ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు.

తలనొప్పి, గొంతునొప్పి రావడంతో ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.  ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక సోమవారం రాగా.. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

- Advertisement -
దీంతో సుమలత ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో.. త్వరలోనే తాను కరోనా నుంచి బయటపడతాననే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
 
ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులకు వెల్లడంచానని తెలిపిన సుమలత.. వీలైనంత త్వరగా వారంతా కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
 
జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, ఆమె పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇప్పటికే కరోనాపై తన నియోజక వర్గ ప్రజలకు పలుమార్లు అవగాహన కల్పించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించిన సుమలత చివరికి తనే దాని బారిన పడ్డారు.
- Advertisement -