పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. పునరుద్ధరించిన టెక్నికల్ టీమ్…

5:24 pm, Thu, 28 May 20

హైదరాబాద్: హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. సాంకేతిక బృందం సాయంతో గంటసేపు శ్రమించి మళ్లీ అకౌంట్‌ను పునరుద్ధరించారు.

ఈ విషయాన్ని స్వయంగా పూజా ఓ ట్వీట్ ద్వారా తెలియజేసింది. బుధవారం అర్థరాత్రి 12.37 గంటల ప్రాంతంలో తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పూజ ట్వీట్ చేసింది. 

‘‘హాయ్ ఆల్!! నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఇప్పుడే నా టెక్నికల్ టీం సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మేము దానిని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. కాబట్టి నా అకౌంట్ నుంచి వ్యక్తిగతంగా ఎవరికైనా మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మకండి. అలాగే మీ వ్యక్తిగత సమాచారం చెప్పమని అడిగితే మీరూ చెప్పకండి.. ధన్యవాదాలు..’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

ఆ తరువాత 1.05 గంటల ప్రాంతంలో మళ్లీ ఓ ట్వీట్ ద్వారా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది. 

‘‘హ్యాకింగ్‌కి గురైన నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని తిరిగి పునరుద్ధరించాం. దీనికోసం గంటసేపు కష్టపడిన నా టెక్నికల్ టీంకు ధన్యవాదాలు. చివరికి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నా చేతుల్లోకి వచ్చింది. గంట క్రితం నా అకౌంట్ నుంచి వచ్చిన పోస్టులు, మెసేజ్‌లను తొలగించాం..’’ అని పేర్కొంది.

పూజా ఈ ఏడాది ఆరంభంలోనే ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తుండగా, రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.