మరీ ఇంత నీఛమా? నిన్ను చూస్తే జాలేస్తోంది..: ఆర్జీవీ ‘మర్డర్’ చిత్రం‌పై అమృత స్పందన

amrutha-pranay-reaction-on-rgv-murder
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పట్ల జాలి కలుగుతోందని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వ్యాఖ్యానించింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘మర్డర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

- Advertisement -

‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమా మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య ఉదంతాన్నే స్ఫురింపజేస్తోంది.

దీనిపై ప్రణయ్ భార్య అమృత తాజాగా స్పందించింది. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలని తనకు అనిపించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘‘ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్నతండ్రికి కూడా దూరమయ్యాను. ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏవేవో మాట్లాడుతున్నారు..’’ అంటూ వాపోయింది. 

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా అని అమృత ప్రశ్నించింది. అసలు తన గురించి తన సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదని పేర్కొంది. 

‘‘గర్వంతో, పరువు పోయిందనే భ్రమలో పడి నా భర్త ప్రణయ్‌ను.. నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు..’’ అంటూ అమృత ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇప్పటికీ తాను ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నానని, న్యాయం కోసం పోరాడుతున్నానని, ఏదోలా కాలం వెళ్లదీస్తుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య ఎదురైందని వ్యాఖ్యానించింది. 

‘‘ఏడుద్దామన్నా నాకు కన్నీళ్లు రావడం లేదు.. హృదయం బండబారి పోయింది.. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు.. రామ్ గోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పట్నించి భయంతో వణికి పోయా..’’ అంటూ తన మనోవేదనను వ్యక్తం చేసింది అమృత. 

తన కొడుకును చూసుకుంటూ ఉన్నంతలో ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నానని, ఇప్పుడు సమాజం కళ్లన్నీ మళ్లీ మరోసారి తనపై పడేలా రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడంటూ వాపోయింది.

‘‘వర్మా.. నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లు ఉపయోగించుకుని నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. నీలాంటి ప్రముఖ దర్శకుడు పేరు కోసం ఇంత నీఛానికి దిగజారతావని ఎప్పుడూ అనుకోలేదు..’’ అని అమృత దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 

అంతేకాదు, ‘‘మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూసి జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను. ఈ నీఛ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలు అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్..’’ అంటూ అమృత ఆ ప్రకటనలో పేర్కొంది. 

 

- Advertisement -