టీజర్ చూసి ముగ్ధుడైన ప్రభాస్.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కు ప్రశంస!

7:20 pm, Sun, 14 April 19
shahid-prabhas

హైదరాబాద్: కొన్నాళ్ల కిందట టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం పలు భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే రిలీజ్ చేయగా, తెలుగు అగ్రహీరో ప్రభాస్‌ను అది విపరీతంగా ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్ సెట్స్ మీదే కబీర్ సింగ్ టీజర్‌ను తిలకించి.. వెంటనే షాహిద్ కపూర్‌కు ఫోన్ చేసి అభినందించినట్టు ప్రఖ్యాత హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ తెలియజేశారు.

“నేను సాహో షూటింగ్ కోసం ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నాను. అప్పడే ఆన్‌లైన్‌లో కబీర్ సింగ్ టీజర్ రిలీజైంది. ఆ టీజర్‌ను చూసిన ప్రభాస్ ముగ్ధుడయ్యాడు. అతని టీమ్ మెంబర్స్ కూడా ఫిదా అయ్యారు.  అప్పటికే వాళ్లందరూ అర్జున్‌రెడ్డి చూసినవాళ్లే అయినా కబీర్ సింగ్‌లో షాహిద్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు..’’ అని హకీమ్ తెలిపారు.

‘‘ప్రభాస్ స్పందన చూసిన వెంటనే షాహిద్‌కు ఫోన్ చేసి ప్రభాస్‌కు అందించాను. దాంతో వాళ్లిద్దరూ ఏడు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒరిజినల్ కంటే కబీర్ సింగ్ లుక్కే బాగుందని షాహిద్‌ను ప్రభాస్ ప్రశంసించారు..” అని వివరించారు హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్.