కర్ణాటకలో సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు! భారీగా బంగారం, నగదు స్వాధీనం, హీరోలు యశ్, సుదీప్ స్పందన ఇలా…

- Advertisement -

it-raids-sandalwood-stars-houses

బెంగళూరు: కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులపై గురువారం మొదలైన ఐటీ శాఖ దాడులు శుక్రవారం సైతం కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కొంతమంది నిర్మాతలు, స్టార్ హీరోల ఇళ్లల్లో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమలో పలు హిట్ చిత్రాలు తెరకెక్కిన నేపథ్యంలో కొంతమంది నటీనటులు, నిర్మాతలు అందుకు అనుగుణంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

గురువారం ఒక్కరోజే కర్ణాటకలోని 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నటులు యశ్‌, పునీత్‌ రాజ్‌కుమార్, రాక్‌‌లైన్‌ వెంకటేశ్‌, సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌‌లతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక ఇంటిపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో అధికారులు విలువైన పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాక్‌లైన్ వెంకటేష్ ఇంట్లో దాదాపు 2 కేజీల బంగారం, 20 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు, దీంతో పాటు ఆస్తులకు చెందిన కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

200 మంది సిబ్బందితో 25 బ‌ృందాలుగా…

ఈ ఐటీ దాడుల్లో దాదాపు 200 మంది వరకు సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. వీరిని 25 బ‌ందాలుగా చేసి, ఏకకాలంలో పలువురు శాండల్‌వుడ్ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాత కిరంగదురు విజయ్, సిఆర్ మనోహర్ నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అలాగే బెంగళూరు బనశంకరి ప్రాంతంలోని కత్రిగుప్పాలో నివాసం ఉంటున్న కేజీఎఫ్ చిత్రం హీరో యశ్ ఇంట్లో భారీ మొత్తంలో బంగారం, ప్లాటినమ్ ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో యశ్ ముంబైలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన బయలుదేరి బెంగళూరు చేరుకున్నట్లు చెబుతున్నారు. యశ్ భార్య అయిన రాధిక పండిత్‌ను ఐటీ అధికారులు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బెంగుళూరు రేసుకోర్స్ రోడ్డులోని తేజ్‌వెస్ట్ ఎండ్ అనే స్టార్ హోటల్‌లో యశ్ అద్దెకు తీసుకున్న గదితో పాటు.. కోసకెరిహల్లిలోని అతడి ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించారు. దాడుల సందర్భంగా అధికారులు మూడు సంచుల్లో బంగారం, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. యశ్‌కు 8 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, రెండు బ్యాంకుల్లో రూ.30 కోట్ల వరకు అప్పు ఉందని అధికారులు గుర్తించారు.

మరో స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌కు చెందిన సదాశివ నగర్‌‌లోని నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అతడి ఇంట్లో కూడా భారీ మొత్తంలో బంగారం, కొన్ని విలువైన వస్తువులు వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఐటీ దాడులపై హీరోలు ఏమన్నారంటే…

ఈ ఐటీ దాడులపై ‘కేజీఎఫ్’ హీరో యశ్ స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకేం భయం లేదు. ఐటీ దాడులకు భయపడను. నేనే తప్పూ చేయలేదు. ఐటీ అధికారులను వారి పనిని చేసుకోనివ్వాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలకు రావొద్దు..’ అని వ్యాఖ్యానించాడు.

మరో హీరో సుదీప్‌ తన సినిమా షూటింగులో భాగంగా మైసూరులో ఉండగా అధికారులు అతడ్ని బెంగళూరుకు పిలిపించినట్లు తెలుస్తోంది. జేపీ నగర్‌లోని సుదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు వివిధ విషయాల గురించి అతడ్ని ప్రశ్నించినట్లు సమాచారం.

దీనిపై సుదీప్ మాట్లాడుతూ.. ‘‘ఐటీ దాడుల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు..’ అని వ్యాఖ్యానించాడు.

- Advertisement -