చెదిరిన ‘రంగుల కల’: రోడ్డు ప్రమాదంలో.. కన్నడ బుల్లితెర నటి దుర్మరణం…

2:56 am, Thu, 28 May 20

బెంగళూరు: కన్నడ బుల్లితెర నటి మెబీనా మైఖేల్(22) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర నటీనటులు విషాదంలో మునిగిపోయారు.

బెంగళూరు నుంచి స్నేహితులతో కలిసి కారులో తన హోమ్ టౌన్ అయిన మడికేరికి బయలుదేరిన మెబీనాను మధ్యలో రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుంది.

వీరు ప్రయాణిస్తోన్న కారు ఓ ట్రాక్టర్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెబీనా మృతి చెందగా, ఆమె స్నేహితులు క్షతగాత్రులయ్యారు.

ప్రస్తుతం మెబీనా స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. మరోవైపు మెబీనా మృతి ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో తీవ్ర విషాదం నింపింది.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…

మెబీనా మైఖేల్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించి.. బుల్లితెర నటిగా ఎదిగింది. అతి పిన్న వయసులోనే ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోవడంతో ఆమె ‘రంగుల కల’ చెదిరినట్లయింది. 

మెబీనా కన్నడంలో ప్రసారమయ్యే రియాలిటీ షో ‘ప్యాతే హుడిగిరి హళ్లి లైఫ్’ సీజన్-4‌లో పాల్గొని విజేతగా నిలిచింది. సదరు రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖ నటుడు అకుల్ బాలాజీ.. ఆమె హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న మెబీనాను ఇలా సడన్‌గా మృత్యువు కబళించడం జీర్ణించుకోలేని విషయమంటూ అకుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.