‘మహిళా కబడ్డీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ …

5:11 pm, Sat, 18 May 19
mahila-kabaddi-movie-first-look-poster-launch

హైదరాబాద్: ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్ , కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ శనివారం దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్‌లో జరిగింది.

పోస్టర్‌ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, ఆలీ ఖాన్, మాజీ హీరోయిన్ రంజని, స్నిగ్ద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి బాలమల్లు మాట్లాడుతూ ఆర్ కె గౌడ్ చాలా కాలంగా తనకు మంచి మిత్రుడని చెబుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా శక్తిని చాటిచెప్పే సినిమా…

అలాగే దర్శక నిర్మాతగా అయన తెరకెక్కిస్తున్న మహిళా కబడ్డీ పాటలు తాను ఇటీవలే విన్నానని, చాలా బాగున్నాయని ప్రశంసించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చాటి చెప్పే సినిమా ఇది అని, తప్పకుండా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘మహిళా కబడ్డీ’ పేరుతొ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబందించిన పాటల రికార్డింగ్ పూర్తయిందన్నారు. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీమణులు పాడిన ఆరు పాటలను రికార్డింగ్ చేశామని చెప్పారు.

అలాగే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నామని, ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుందని రామకృష్ణ గౌడ్ వివరించారు.

రచన స్మిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రామకృష్ణ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, నిర్మాత, దర్శకత్వం: ప్రతాని రామకృష్ణా గౌడ్.