నడిగర్ సంఘం కేసు: కోలీవుడ్ నటులు శరత్ కుమార్, రాధారవి అరెస్ట్‌కు ఆదేశాలు!?

1:24 pm, Sun, 5 May 19

చెన్నై: గతంలో సినీ నటుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన శరత్ కుమార్, కార్యదర్శిగా రాధారవిలు సినీ నటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారంటూ ఆరోపణలున్నాయి. నాటి నుంచి ఈ ఆరోపణలు వెంటాడుతుండగా, తాజాగా వీరిద్దరినీ అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిన పోలీసులు సేకరించిన ప్రాథమిక సాక్ష్యాలను కోర్టుకు అందించారు. పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

మూణ్ణెళ్లలో విచారణ ముగించాలన్న మద్రాస్ హైకోర్టు…

కాంచీపురం జిల్లా వెంకటమంగళంలో ఉన్న సినీ నటుల సంఘానికి చెందిన స్థలాన్ని శరత్ కుమార్, రాధారవిలు అక్రమంగా విక్రయించారంటూ 2017లో ఓ వ్యక్తి హైకోర్టుకెక్కాడు. నటులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలంటూ పోలీసులను ఆదేశించి కోర్టు కేసును వారికి బదిలీ చేసింది. అంతేకాదు, మూడు నెలల్లో ఈ కేసును తేల్చాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన పోలీసులు శరత్ కుమార్, రాధారవిలకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలను సంపాదించారు. వాటిని తాజాగా కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన కోర్టు శరత్ కుమార్, రాధారవిలను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా, కోర్టు తీర్పుపై ఇటు శరత్ కుమార్ కానీ, అటు రాధారవి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.