మోడీ సంచలనం: పాకిస్తాన్ పని పట్టేందుకు.. పది పన్నెండు రోజులు చాలు!

prime-minister-narendra-modi-at-ncc-meet
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ నడుమ యుద్ధం అంటూ వస్తే.. పాకిస్తాన్‌ని మట్టికరిపించేందుకు పది నుంచి పన్నెండు రోజులు చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. 

మంగళవారం ఆయన ఎన్‌సీసీ ర్యాలీ 2020లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 70 ఏళ్లలో పాకిస్తాన్ భారత్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేసిన మోడీ.. భారత్ శక్తి ఏమిటో పాకిస్తాన్‌కి తెలుసన్నారు. 

చదవండి: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో 83 మంది!

అందుకే అది ప్రత్యక్షంగా మన దేశంతో తలపడకుండా పరోక్ష యుద్ధం సాగిస్తోందని, కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది సైనికుల, సాధారణ పౌరుల ప్రాణాలు బలిగొందని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ తోక జాడించినప్పుడల్లా తిప్పికొట్టడానికి మన సైనికాధికారులు ప్రయత్నించేవారని, దురదృష్టవశాత్తూ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వారిని కట్టడి చేసేవారని విమర్శించారు. 

‘‘జమ్మూ కశ్మీర్‌లో హింస ఆ కుటుంబాల ఫలితమే..’’ 

కొన్ని రాజకీయ కుటుంబాల వల్లే జమ్మూ కాశ్మీర్‌లో దశాబ్దాలుగా హింసాకాండ రాజ్యమేలుతూ వచ్చిందని, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ అక్కడ ఇదే తరహా వాతావరణం నెలకొని ఉండేదని ప్రధాని అన్నారు. దీని ఫలితంగానే అక్కడ ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు.

కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న సమస్యలను తామిప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

దశాబ్దాలుగా వివక్షలో ముస్లిమేతరులు, మైనారిటీలు…

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లల్లో దశాబ్దాలుగా ముస్లిమేతరులు, మైనారిటీలు తీవ్ర అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని కూడా ప్రధాని మోడీ అన్నారు. ఈ పరిస్థితిని సరి చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులకు పౌరసత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం సమంజసం కాదని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌లో అయితే మరీ ఘోరం…

పాకిస్తాన్‌లో నివసిస్తోన్న ముస్లిమేతరుల జీవనం మరీ దుర్భరంగా ఉందని, వారికి టాయ్‌లెట్లను కడిగే ఉద్యోగాలను అక్కడి ప్రభుత్వం ఇవ్వజూపిందని, పారిశుద్ధ్య విభాగంలో ఉద్యోగాల భర్తీకి ముస్లిమేతరులు దరఖాస్తు చేసుకోవాలంటూ కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేయడమే దీనికి ఉదాహరణ అని మోడీ చెప్పుకొచ్చారు. 

చదవండి: కొంప ముంచిన రోడ్ షో.. నామినేషన్ వేయలేకపోయిన ఢిల్లీ సీఎం!

అంతేకాదు, చారిత్రక అన్యాయాన్ని సరి చేయాలనే ఉద్దేశంతోనే తాము పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా భావించే భారత్‌లో మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి కారణమైన వారిని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తోన్న ఆందోళనకారులు.. పాకిస్తాన్‌లో నివసించే మైనారిటీలకు న్యాయాన్ని అందించగలరా? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

- Advertisement -