దర్శకుడు ఆ మాట అనగానే చెప్పుతో కొడతానన్నా: నేపథ్య గాయని ప్రణవి

9:06 pm, Wed, 8 May 19

హైదరాబాద్: శ్రీరెడ్డి పుణ్యమా అని సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో శ్రీరెడ్డి చేసిన హడావుడి కాస్తా ఎక్కువే అనిపించినా ఆ తర్వాత నిజమేనంటూ ఒక్కొక్కరు తామకు ఎదురైన అనుభవాలను ఏకరవు పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా తెరచాటు బాగోతాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన తమను ఎలా ‘వాడుకున్నదీ’ బాధితులు ఇంకా ఏకరువు పెడుతూనే ఉన్నారు.

అయితే, ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఒక్క హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితం కాలేదు. సింగర్లకు కూడా ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయట. పాటపాడాలంటే తనతో గడపాల్సిందేనంటూ ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా మాట్లాడాడంటూ సింగర్ ప్రణవి ఆచార్య సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ చేతు నిజాన్ని బయటపెట్టింది.

‘మీటూ’ లాంటి అనుభవమే తనకూ ఎదురైందని, పాటపాడాలంటే తనతో ఓ రాత్రి గడపాలంటూ ఓ దర్శకుడు తనతో అసభ్యంగా, నీచాతి నీచంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది. నీ వయసేంటి? నా వయసేంటని చెడామడా వాయించేశానని, చెప్పుతో కొడతానని హెచ్చరించానని చెప్పుకొచ్చింది. తాను ఇంటర్మీడియట్ చదువుతున్నానని, కొత్తగా పెళ్లైన మీకు ఇదేం పోయేకాలమని గట్టిగా అడిగానని పేర్కొంది. అయితే, పెళ్లై మూడు నెలలు అయిపోయిందని అన్నడంతో తన కోపం నషాళానికి ఎక్కిందని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుతుందని వార్నింగ్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. అవకాశం ఉంటే ఇవ్వాలని, లేదంటే లేదని చెప్పి వచ్చేశానని ప్రణవి ఆచార్య వివరించింది.

తనను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోనని, కాలర్ పట్టుకుని కొట్టడానికైనా వెనుకాడడని ప్రణవి పేర్కొంది. రఘు మాస్టర్ (కొరియోగ్రాఫర్)తో పెళ్లయ్యాక తన జోలికి ఎవరూ రాలేదని తెలిపింది. మా టీవీ సూపర్ సింగర్‌తో ఫేమస్‌ అయిన ప్రణవి టాలీవుడ్‌లో యమదొంగ చిత్రంలోని ‘రబ్బరు గాజులు‘ పాటతో బాగా ఫేమస్ అయింది. అదే సినిమాలో ‘యంగ్ యమా’ పాటను కూడా పాడింది. అలాగే, శ్రీరామదాసు, జెంటిల్మెన్, లోఫర్, పెళ్లి చూపులు, ఒక మనసు, హ్యాపీ డేస్ తదితర చిత్రాల్లో ప్రణవి పాటలు పాడింది.