రూపాయి తీసుకోలేదు, చచ్చిపోతానేమో, ‘అలీతో సరదాగా’ షోలో రేణూ దేశాయ్!

3:13 pm, Thu, 11 April 19
renu-desai-with-ali-in-the-latest-episode-of-alitho-saradaga

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటుడు.. వైఎస్సార్సీపీలో చేరిన అలీ మధ్య ప్రస్తుతం పొలిటికల్ వార్ ఏ స్థాయిలో జరుగుతోందో తెలిసిందే. వీరిద్దరి నడుమ మొన్నటి వరకు ఉన్న స్నేహం ఇటీవల ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అలీపై పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేయడం, అందుకు అలీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ‘అలీతో సరదాగా’ టెలివిజన్ షోలో త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్ హయ్యస్ట్ రేటింగ్స్‌ను సొంతం చేసుకునే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈసారి షోలో కనిపించబోతోన్న హోస్ట్ ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రూపొందించిన ప్రోమో తాజాగా విడుదలై ఈ షో పట్ల ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది.

రేణూ దేశాయ్‌ పాల్గొన్న ఎపిసోడ్‌లో.. అలీ ఆమెను మాటల్లో పెట్టి అనేక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే రేణూ దేశాయ్ కూడా ఎపిసోడ్ చివరలో.. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు, అలీకి మధ్య జరిగిన గొడవ గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

ప్రోమో విశేషాలు…

రేణూ దేశాయ్‌ పాల్గొన్న ఎపిసోడ్‌లో అలీ మాట్లాడుతూ.. మీకు ‘రేణు’ అనే పేరు ఇష్టం లేదట కదా? ఎందుకు? అని ప్రశ్నించగా.. ‘‘అవును.. నాకు ఆ పేరు ఇష్టం లేదు. రేవతి అనిగాని లేదంటే రేవ అనిగాని పెడితే బాగుండేది. ఎందుకో.. రేణు అనే పేరు నాకు నచ్చలేదు..’’ అని చెప్పారు.

తరువాత, అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంటకదా? అని అలీ అడగ్గా.. ‘‘నేను జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్‌గా చేశాను.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్‌జే సూర్యగారు, రత్నంగారు, నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ గారే దీనికి సాక్ష్యం..’’ అని రేణూ దేశాయ్ బదులిచ్చారు.

‘‘నా రెండో పెళ్లి కూడా ఒక పెద్ద డిస్కషన్..’’

తరువాత అలీ రేణూ దేశాయ్ వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. మగవాళ్లు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవాళ్లు ఎందుకు చేసుకోకూడదు అని ఒక పోస్టు మీరు పెట్టారు కదా.. మీరు త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నించారు.

దీనిపై.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘అవును, అల్రెడీ మరొకరితో ఎంగేజ్‌‌మెంట్ కూడా అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ విషయం పెట్టిన తర్వాతే పెద్ద హడావుడి జరిగింది. నా రెండో పెళ్లి కూడా ఒక పెద్ద డిస్క్రషన్. దీన్ని నేను రహస్యంగా చేసుకోవడం లేదు. ఇదేమీ దొంగపని కాదు..” అని రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు.

‘‘అదే లేకుంటే చచ్చిపోతానేమో…’’

మీరు పుట్టినప్పుడు ఆసుపత్రికి మీ ఫాదర్ రాలేదంట కదా? ఎందుకని? అంటూ అలీ మరో ప్రశ్న వేయగా.. ‘‘అవును.. మీరు విన్నది నిజమే. అమ్మాయి పుట్టిందనే కోపంతో మా నాన్న రాలేదు. నేను చాలా లక్కీ ఉమన్, ఎందుకంటే నాకు ఆద్య లాంటి కూతురు ఉంది. ఆద్య లేకుండా నేను ఉండలేను.. చచ్చిపోతానేమో..’’ అంటూ రేణూ దేశాయ్ కాస్త భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకోవడం ప్రోమోలో చూడొచ్చు.

పవన్-అలీ గొడవపై ప్రశ్నించిన రేణూ…

షోలో రేణూ దేశాయ్ కూడా అలీని ఓ ప్రశ్న అడుగుతారు. ‘‘మీకు, కళ్యాణ్ గారికి గొడవ అయిందని విన్నాను.. నిజంగానే అయిందా?’’ అని రేణూ అడిగిన ప్రశ్నకు అలీ ‘‘అవును’’ అని జవాబు ఇవ్వడంతో ఈ షో ప్రోమో అయిపోయింది.

మరి రేణూ దేశాయ్ పాల్గొన్న ‘అలీతో సరదాగా’ పూర్తి షో త్వరలోనే ప్రసారం కానుంది. రేణూ దేశాయ్ అలీని అడిగిన ఆ ప్రశ్న, దానికి అలీ ఏమని సమాధానం చెప్పి ఉంటాడనే ఊహలతో ఈ షోపై అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగింది.