‘బిగ్‌బాస్’ హౌస్‌లో ప్రేమ.. నిశ్చితార్థం వరకు…ఇక పెళ్లెప్పుడో?

2:15 pm, Tue, 22 October 19
chandan-shetty-niveditha-gowda

మైసూరు: ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో ఇద్దరు కంటెస్టంట్ల నడుమ చిగురించిన ప్రేమ.. మరింత పరిణితి చెంది.. తాజాగా వారిరువురి నిశ్చితార్థానికి దారితీసింది. వారిరువురు.. కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టంట్లు చందన్‌శెట్టి, నివేదిత గౌడ.  సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో తమ మధ్య చిగురించిన ప్రేమను వీరిరువురు నిశ్చితార్థం ద్వారా మరో మెట్టుకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరు ఉంగరాలు మార్చుకున్నారు.

బిగ్‌బాస్-5 షో ముగిసినా…

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొన్న గాయకుడు చందన్‌శెట్టి, నివేదిత గౌడ.. ఆ షో ముగిశాక బయట కూడా చెట్టపట్టాలేసుకొని తిరిగేవారు. దీంతో వీరిరువురి మధ్య ప్రేమాయణం సాగుతోందని వార్తలు బయటికొచ్చాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ వీరిరువురు నిశ్చితార్థం చేసుకున్నారు.

అంతకుముందు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న చందన్‌శెట్టి.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నివేదితకు తన ప్రేమ వ్యక్తపరిచాడు. అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ వీరిద్దరూ వాటిని పట్టించుకోకుండా నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా తమ మధ్య ఉన్న ప్రేమను మరింత బలోపేతం చేసుకున్నారు.