ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన పనికి అభిమానులు షాక్! అసలేం జరిగిందంటే…

5:31 pm, Tue, 19 May 20
priya prakash varrier quits instagram

తిరువనంతపురం: మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తింది కదా? ఎలా మర్చిపోతాం.. కొంటెగా కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిన ఆమెను ఎలా మర్చిపోగలం అంటారా? మీరన్నదీ నిజమేలెండి!

కాకపోతే ఇప్పుడీ అందాల భరిణె చేసి ఓ పని మాత్రం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. ‘అయ్యో.. ప్రియా ఇలా చేశావేంటి? ఏం జరిగిందనీ..’ అనుకుంటూ పాపం వాళ్లు తెగ మథనపడిపోతున్నారు.

ఇంతకీ ఈ కన్నుగీటే సుందరాంగి ఏం చేసి ఉంటుందబ్బా అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? పెద్దగా చేసిందేమీ లేదులెండి.. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుంది.. అంతే!

అసలేం జరిగిందంటే…

కొంతకాలంగా ప్రియా ప్రకాష్ వారియర్ ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. 

అభిమానుల కోరిక మేరకు ఇటీవలే ఆమె ‘టిక్‌టాక్’లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఉన్నట్లుండి ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు. దీనికేదో బలమైన కారణం ఉండే ఉండొచ్చని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలకు సంబంధించి అభ్యంతరకరమైన స్పందనలు వచ్చి ఉండొచ్చని, బహుశా ప్రియా అందుకే తప్పుకొని ఉంటారని చెప్పుకుంటున్నారు.

అయితే బాధపడాల్సిందేమీ లేదు.. ప్రస్తుతం ఆమె ఫేస్‌బుక్, టిక్‌టాక్ వేదికల ద్వారా తన అభిమానులకు ప్రియ చేరువగానే ఉన్నారు. 

ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళంలో తెరకెక్కిన ‘ఒరు అడార్ లవ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తన హావభావాలు, నటనతో ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ఒక వీడియో ప్రియ జీవితాన్నే మార్చేసింది. ఆ ఒక్క వీడియో ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది. 

దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 

అతి తక్కువ సమయంలోనే 7 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సెలబ్రిటీల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. తెలుగులో సైతం నటించేందుకు ఆమె సిద్ధమయ్యారు. 

కుర్రకారులో అంతటి క్రేజ్ ఉన్న ప్రియ ఉన్నట్లుండి ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుంటే అభిమానులు ఆ మాత్రం షాక్ అవరేంటీ? నిజమే కదా!