‘మహానటి’ సావిత్రి చివరి రోజుల్లో… ఇదీ జరిగింది!

3:49 pm, Sun, 22 July 18
Savithri1

సినీ రంగంలో ఎవరి జీవితాలు ఎప్పుడెలా తారుమారు అవుతాయో చెప్పలేం. ఒక దశలో గొప్ప జీవితాన్ని అనుభవించి.. ఆ తర్వాత దారుణమైన స్థితికి చేరిన సినీ ప్రముఖులు చాలామందే కనిపిస్తారు చరిత్రలో. మహానటి సావిత్రి కూడా ఆ జాబితాలో చేర్చదగ్గ వ్యక్తే. తన జీవిత చరమాంకంలో ఆమె దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నట్లుగా చెబుతారు.

రెండున్నర  దశాబ్దాలు పాటు తెలుగు,తమిళ చలన చిత్ర రంగంలో తిరుగలేని తారగా వెలగొంగిన సావిత్రి చివరి రోజులు అంత బాధాకరంగా గడుస్తాయని ఎవరూ అనుకుని ఉండరు. సినిమా నటులుకు నటన తప్పించి మరేది చేతకాదు అనుకుంటారు. కానీ వారికి మనస్సు ఉంటుందని, అది స్పందిస్తుందని తెలియదు. సావిత్రి మనస్సు ప్రేమను కోరుకుంది. ప్రేమ పిచ్చిది అన్నమాట ఆమెకు బాగా అతుకుతుంది. జెమినీ గణేషన్ ని పిచ్చిగా ప్రేమించింది. అతనికి అప్పటికే వివాహం అయ్యిందని, అతనికి చాలా మంది తారలకో సంభంధాలు ఉన్నాయని తెలుసు.

ఆ విషయంలో ఆమెను హెచ్చరించేవారు లేరు. ఐనా రహస్యంగా మైసూరు వెళ్లి చాముండేశ్వరిదేవి సమక్షంలో పెళ్లాడింది. అప్పటికి ఆమె వయస్సు రెండు పదుల లోపే. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చేసింది.  సావిత్రి సిని కెరీర్ అద్బుతంగా ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఆమె వెంటే ఉన్నాడు. తాను తాగుతూ సరదాగా సావిత్రిని తాగమని అడిగాడు. అంతవరకూ మందు ముట్టని సావిత్రి తర్వాత జెమినీ గణేషన్ పుణ్యమా అని మందు లేకుండా బ్రతకలేని స్దితికి వచ్చింది.

ప్రతీ రాత్రి మందు కావాలి. సినిమా అవకాశాలు తగ్గటంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి అమాయకురాలు. ఆర్దికపరమైన లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియదు. ఎవరిని పడితే వారిని నమ్మింది. అవే ఆమెకు సమస్యలు తెచ్చిపెట్టాయి. సావిత్రి సంపాదన మీద పెత్తనం చెలాయించాలనుకున్న జెమినీ గణేషన్ చాలా వరకూ విజయం సాధించాడు. గుడ్డిగా తన ఆదాయమంతా భర్త చేతిలో పెట్టిందామె.

తెలుగులో వచ్చిన మూగమనస్సులు సినిమా, అందులో ఆమె పాత్రను ప్రేక్షకులు మరవలేరు. ఆ సినిమాను తమిళంలో నిర్మించాలనుకుంది సావిత్రి. అందుకు హీరోగా భర్తను ఎంపింక చేసుకోవటం, దాని మీద భర్త అభ్యంతరంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయ. తన డబ్బు తన ఆధీనంలో లేదన్న వాస్తవం తెలిసి వచ్చింది. సినిమా ఆగకూడదన్న పట్టుదలతో ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన సినిమాను తమిళులు ఎందుకు తిరస్కరించారో తెలియదు. ఆర్దికనష్టం, అప్పుల మీద వడ్డీలు, తన మాట వినలేదన్న కోపంతో జెమినీ గణేషన్ ఇంటికి రావంట మానేసాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవటం ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి.

హై బీపీ, షుగర్ జబ్బు వారి వంశంలో వస్తున్న అనారోగ్యాలు. అవి రెండు ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సావిత్రి తీసుకోలేదు. 1971కల్లా వావిత్రి తాగుడుకి బానిస అయ్యింది. తాగుడు వద్దని దేవదాసుకు నీతి భోధ చేసిన ఈ సినీ పార్వతి అదే తాగుడులో మునిగితేలింది. తాగుడు తప్పించి, తిండ తినదు శరీరం ,మనస్సు రెండూ పాడయ్యాయి. సావిత్రి చుట్టూ వంది మాగధులు చేరి ఆమెను ఉబ్బి తబ్బిబ్బు అయ్యేలా చేసేవారు.

సావిత్రిది మొదటి నుంచీ మహారాణి జీవితమే. మహారాణులు దానం చేసినట్లే తన దగ్గరన్నది అలా తీసి ఇచ్చేది. కాలం మారినా ఆమె అలవాటు మారలేదు. అడిగిన వారికి ఏదో ఒకటి ఇచ్చే అలవాటు పోలేదు.

ఇదంతా కూతురు, అల్లుడుకి నచ్చలేదు. ఆమె వియ్యాలవారికి నచ్చలేదు. వారు విధిస్తున్న ఆంక్షలకు లోబడి బతకడం సావిత్రికి ఇష్టం లేదు. ఫలితంగా తాను మహారాణిలా బతికిన బంగళాను వదిలి కేవలం 500 రూపాయల అద్దెకు చెన్నపట్నంలో అన్నానగర్ ప్రాంతానికి మారింది. ఆ ఇంట్లోనే కొడుకుతో గడిపింది.

నాటివరకూ సావిత్రి ఆదాయపు పన్ను సక్రమంగా కట్టలేదు దానితో ఆమెకు నోటీసులు వచ్చాయి. చాలా కాలం ఆ నోటీసులు పట్టించుకోలేనంత మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయపు పన్ను శాఖవారు వడ్డీల మీద వడ్డీలు లెక్కలుకట్టి లక్షల్లో బకాయి చూపి కడతారా లేక ఆస్దులు జప్తు చేయమంటారా అనే బెదిరింపులు మొదలెట్టారు.

తాగుడు తనని పతనం చేసిందని ఆమె అర్దం చేసుకుని, ఆ మత్తు బానిసత్వనం నుంచి బయిటపడి మళ్లీ సినిమాల్లో నటించటం మొదలెట్టింది. ఆ మహానటిని దర్శకత్వం వహించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్న దర్శకులు ఆదరించారు.  ఆమెతో నటించే మహదావకాశం కోసం ఎదురుచూసే నటులు పొంగిపోయారు. కానీ పీక్కుపోయిన ఆమె ముఖం చూసి ప్రేక్షకులు మాత్రం కంటతడిపెట్టారు.

 

savitrhri

ఒకప్రక్కన కన్నడ షూటింగ్  కోసం బెంగుళూరు వెళ్లిన సావిత్రి తన ఆస్దులన్ని జప్తు చేసే నోటీసు వచ్చిందన్న విషయం తెలుసుకుంది. అప్పటికే రెండు మూడేళ్లుగా మందు మానేసిన సావిత్రి ఆ రోజు హోటల్లో తిరిగి తాగటం మొదలెట్టింది. దగ్గర ఎవరూ లేరు. తాగటం మొదలెట్టిన తర్వాత ఇక ఆపటం తెలియలేదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. అప్పటికే ఆమెకు ఇన్సులిన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తనకు తాను ఇన్సులిన్ డోస్ తీసుకుంటూండేది. కానీ ఆ రోజు ఆ ఇంకెక్షన్ తీసుకుందో లేదో తెలియదు.తీసుకుంటే వెంటనే ఏదొకటి తినాలి. కొడుకు సతీష్ బలవతం చేస్తే బిస్కెట్ మాత్రం తిన్నది. మైసూరు నుంచి బెంగుళూరు మీదుగా మద్రాసు వెళ్లేటప్పుడు అక్కడ ఆగి ఒక కుక్కపిల్లను తీసుకువెళదాం అని కొడుకుతో చెప్తూ నిద్రలోకి జారుకుంది.

తెల్లారింది. కానీ ఆ మహానటి నిద్రలేవలేదు. నోటి నుంచి నురగ వస్తోంది. విషపురుగు కుట్టిందేమో అని అనుకున్నారు. కానీ ఆమె డయోబెటిక్ కోమాలోకి వెళ్లింది. ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుని ఆహారం తిననందున ఆమెకు వచ్చిన ఇబ్బంది ఇది అని డాక్టర్లు తేల్చారు. 1980 మో 11 న కోమాలోకి వెళ్లిన మహానటి 1981 డిసెంబర్ 26న మరిణించే వరకూ ఆమె పరిస్దితిల్లో ఏ మార్పూలేదు.

ఎప్పుడైనా ఎవరైనా వెళితే కళ్లు తెరిచి చూసినా ఆమె గుర్తు పట్టిందో లేదో తెలియని పరిస్దితి. ఆమెకు నచ్చిన పాటలు వినిపిస్తే స్పందిస్తుందనుకుని ఆమె నటించిన పాటలు వినిపించేవారు. దేవదాసు చిత్రంలోని కలయదనీ..నిజమిదని..బ్రతుకింతేనులే పాటకు కొంచెం కదలిక చూపించేదంటారు.

బక్క చిక్కిపోయి, ఎముకల గూడులా మారిపోయిన సావిత్రి , శరీరంలోని ఒక్కొక్క అంగం పనిచేయటం మానేస్తూంటే ఆమె ఎప్పటికైనా కోలుకుంటుందేమో అని ఆశతో గొట్టం ద్వారా ద్రవ ఆహార పదార్దాలును ఎక్కిస్తూ వైద్యులు చెయ్యగలిగినంతా చేసారు. కానీ ఫలితంలేదు.

సావిత్రి తనయురాలు విజయ ఛాముండేశ్వరి ఓ ఇంటర్వ్యూలో భాగంగా సావిత్రి జీవిత చరమాంకం గురించి మాట్లాడారు.

‘‘అమ్మ ఎక్కడున్నా రాణిలా బతికింది. కానీ చివరి రోజుల్లో తను అనారోగ్యం పాలై యాతన అనుభవించింది. ఆమె 19 నెలల పాటు కోమాలో ఉన్నారు. అమ్మ పరిస్థితి చూసి నేను చాలా కుంగిపోయా. నిజానికి తన అమాయకత్వం వల్లే ఆమె ఆ పరిస్థితి తెచ్చుకుంది. ఎవరేం చెప్పినా నమ్మేసేది. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు పడిపోయేది. వాళ్లను నమ్మేసేది. ముందూ వెనకా ఆలోచించకుండా దాన ధర్మాలు చేసేసేది. అలా చాలా డబ్బులు పోగొట్టుకుంది. ఆ రోజుల్లో ఎవరూ అమ్మకి ఆర్థిక భద్రత గురించి చెప్పలేదు.

ఆమె కూడా ఆలోచించలేదు. మా విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. నాకే 16వ ఏటనే పెళ్లి చేసింది. అప్పటికే ఆమె ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో నాకు పెళ్లి చేయాలని తొందరపడి.. మా బావకిచ్చి చేసింది. ఐతే అమ్మ తన గురించి మాత్రం జాగ్రత్త పడలేదు. ఆమెకు అప్పటికే షుగర్ ఉంది. దీనికి తోడు ఒత్తిడి.. ఇతర అనారోగ్య సమస్యలు ఆమెను కుదిపేశాయి. 19 నెలల పాటు కోమాలో ఉండి తర్వాత చనిపోయింది. ఆ 19 నెలలూ అమ్మని తలచుకుని నాన్న బాధ పడని రోజు లేదు’’ అని చాముండేశ్వరి చెప్పింది.

(సోర్స్..  స్వాతిలో వచ్చిన ఆర్టికల్ ,మరియు మరికొందరు చెప్పిన విషయాలు నుంచి తీసుకుని …)

 – సూర్యప్రకాష్ జోశ్యుల