షాకింగ్: నటుడు బ్రహ్మానందానికి గుండెపోటు.. ముంబై ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ! ఇప్పుడెలా ఉందంటే…

11:41 am, Wed, 16 January 19
brahmanandam-heart-attack

brahmanandam-heart-attack

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనకు వైద్యులు వెంటనే బైపాస్ సర్జరీ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మానందం కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారి కథనం ప్రకారం… గుండెపోటుకు గురైన సమయంలో బ్రహ్మానందం ముంబైలో ఉన్నారు. వెంటనే ఆయన్ని అక్కడి ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.

ఆపై పలు పరీక్షలు చేసిన ప్రముఖ హార్ట్ సర్జన్ రమాకాంత పాండా, పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ నిర్వహించారు.

ఆరోగ్య పరిస్థితి నిలకడగా…

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తరువాత ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మానందం వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఆయన ఇప్పటివరకు 1000కి పైగా చిత్రాల్లో నటించారు.

బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ జరుగుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోనే ఉన్నారు. ఆయన  కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్ధ్‌లు దగ్గరుండి తండ్రిని చూసుకుంటున్నారు. మరోవైపు బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఒకే భాషలో ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. ఇటీవల ఆయనకు సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెరపైన మెరుస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్నారు.