విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలి…

- Advertisement -

గుంటూరు: ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మంగళవారం ఉదయం గుంటూరులోని విద్యానగర్‌లో తన నివాసంలోనే కన్నుమూశారు.

గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలిన ఆయన తుదిశ్వాస విడిచారు. 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామం.

- Advertisement -

అయితే నాటకరంగంపై ఉన్న మక్కువతో ఆయన గుంటూరులో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి ఉన్నారు.  

నల్గొండ జిల్లాలో ‘గప్‌చుప్’‌ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా.. జేపీ నటన నచ్చి దాసరి నారాయణరావు ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేశారు.

జయప్రకాశ్ రెడ్డి 1988లో  ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు వందకుపైగా చిత్రాల్లో ఆయన నటించారు. 

1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా గుర్తింపు పొందిన ఆయన సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 

ఆ తరువాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి చిత్రాల్లో నటించారు. 

ఇంకా.. బిందాస్, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్‌షా, రేసుగుర్రం, మనం, పటాస్, టెంపర్, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్ తదితర చిత్రాల్లోనూ జయప్రకాశ్ రెడ్డి నటించారు. 

జయప్రకాశ్ రెడ్డి చివరి చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఆయన మృతి పట్ల పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఆయన మృతి వార్త తెలియగానే బంధువులు, సన్నిహితులు, కళాకారులు విద్యానగర్‌‌లోని ఆయన నివాసానికి తరలివచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 

గుంటూరుతో అనుబంధం…

జయప్రకాశ్ రెడ్డికి గుంటూరుతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన అక్కడి ఏసీ కళాశాలలోనే విద్యనభ్యసించారు. సినీ పరిశ్రమకు రాకముందు గుంటూరులోని మున్సిపల్ పాఠశాలలో పనిచేశారు. 

ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ఆయన.. పాఠశాలలో పనిచేస్తున్న సమయంలోనే సినిమా రంగంలోకి ప్రవేశించారు. 

అయినప్పటికీ నాటకరంగంపై మక్కువను ఆయన పోగొట్టుకోలేదు. గత మూడేళ్లుగా ప్రతి నెల రెండో ఆదివారం ‘జేపీస్ నెలనెలా నాటక సభ’ పేరుతో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 

అంతేకాదు, కొన్ని నాటకాలలో జయప్రకాశ్ రెడ్డి స్వయంగా నటించే వారు. ఆయన ఏకపాత్రాభినయం చేసిన ‘అలెగ్జాండర్’ నాటకం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి జయప్రకాశ్ రెడ్డి దంపతులు గుంటూరు విద్యానగర్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. ఆయన కుమారుడు, కోడలు కరోనా బారిన పడినప్పటికీ అదే ఇంటి పైభాగంలోని పెంట్ హౌస్‌లోనే వీరు ఉంటున్నారు. 

జయప్రకాశ్ రెడ్డి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొడుకు, కోడలు పీపీఈ కిట్లు ధరించి ఆయన పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. 

జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలియగానే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తదితరులు ఆయన నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను మధ్యాహ్నం గుంటూరులోని కొరిటెపాడులో నిర్వహించారు. 

 

- Advertisement -